హైదరాబాద్: పేరు ‘ఫ్రెష్ చికెన్’ అయినా, లోపల జరుగుతున్నది మాత్రం విరుద్ధంగా ఉన్న ఘటన బయటపడింది. నగరంలోని పార్సీ గుట్ట ప్రాంతంలో ఉన్న ఏవన్ ఫ్రెష్ చికెన్ షాప్‌పై సికింద్రాబాద్ టాస్క్ ఫోర్స్, జీహెచ్ఎంసీ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు.
ఈ దాడుల్లో దాదాపు 15 రోజుల నుంచి నిల్వ ఉంచిన చికెన్‌ను విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఫ్రీజర్లు, ప్లాస్టిక్ కంటైనర్లలో ఐస్ ముక్కల మధ్య నిల్వ ఉంచిన సుమారు 800 కిలోల చికెన్‌ను స్వాధీనం చేసుకున్నారు.
అధికారుల సమాచారం ప్రకారం, ఈ పాడైపోయిన చికెన్‌ను నగరంలోని వైన్స్, బార్లు, రెస్టారెంట్లకు సరఫరా చేస్తున్నట్లు అనుమానం వ్యక్తమవుతోంది. వినియోగదారుల ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా ఈ విధంగా వ్యవహరించడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.
ఇంకా విచారణలో ఈ షాపుకు సంబంధించిన లైసెన్స్ జనవరి నెలలోనే గడువు ముగిసినట్లు తేలింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి, షాపు నిర్వాహకుడు షకీల్‌తో పాటు మరికొందరిని అదుపులోకి తీసుకున్నారు. మొత్తం వ్యాపార లావాదేవీలపై అధికారులు లోతుగా విచారణ కొనసాగిస్తున్నారు.