తాజా వార్తలు
True Times India
ఎడిటర్: SV || Andhra Pradesh Sarvepalli March 10, 2026

సర్వేపల్లిలో విద్యార్థినులకు సైకిళ్ల పంపిణీ: మనుబోలులో 257 సైకిళ్లు అందజేసిన ఎమ్మెల్యే సోమిరెడ్డి

|
ఈ-పేపర్ ప్రింట్ (PDF)


రెండో రోజు మనుబోలులో 257 సైకిళ్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో విద్యార్థినుల కోసం నిర్వహిస్తున్న సైకిళ్ల పంపిణీ కార్యక్రమం ఉత్సాహంగా కొనసాగుతోంది. రెండో రోజు మనుబోలు మండలంలోని జిల్లా పరిషత్ హైస్కూలులో నిర్వహించిన కార్యక్రమంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఏపీ ఆక్వా అథారిటీ చైర్మన్ ఆనం వెంకటరమణారెడ్డి పాల్గొని విద్యార్థినులకు సైకిళ్లు అందజేశారు.

ఈ కార్యక్రమంలో భాగంగా మనుబోలు మండలంలో 257 సైకిళ్లను విద్యార్థినులకు పంపిణీ చేశారు. ఎస్.ఈ.ఐ.ఎల్ (SEIL) కంపెనీ సీఎస్ఆర్ నిధులతో అందించిన హీరో సైకిళ్లను అందుకున్న చిన్నారులు ఆనందం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ గాలి రామకృష్ణారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ పొన్నూరు రామకృష్ణయ్య, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బొమ్మి సురేంద్ర, కనుపూరు కాలువ ప్రాజెక్టు కమిటీ చైర్మన్ వర్దినేని మస్తాన్ నాయుడు, నీటిసంఘం అధ్యక్షుడు పచ్చిపాల రామిరెడ్డి, శివుని రాజాగౌడ్, మండల అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ, ఎస్.ఈ.ఐ.ఎల్ కంపెనీ విద్యార్థినుల కోసం మొత్తం 1840 హీరో సైకిళ్లు అందజేస్తోందని తెలిపారు. మొదటి విడతగా 8వ మరియు 9వ తరగతుల విద్యార్థినులకు సైకిళ్లు పంపిణీ చేస్తున్నామని చెప్పారు.

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర స్పూర్తితో, ఆయన నడిచిన కిలోమీటర్లకు గుర్తుగా 3132 సైకిళ్ల పంపిణీ లక్ష్యంగా కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామని తెలిపారు. కంపెనీ సీఈవో జన్మేజయ మహాపాత్ర సహకారంతో ఈ కార్యక్రమం ముందుకు సాగుతోందని పేర్కొన్నారు.

సర్వేపల్లి నియోజకవర్గ అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో పాటు సీఎస్ఆర్ నిధులను కూడా వినియోగిస్తున్నామని ఆయన చెప్పారు. “తల్లికి వందనం” పథకం వల్ల గిరిజన ప్రాంతాల్లో స్కూలుకు వచ్చే విద్యార్థుల సంఖ్య పెరిగి డ్రాపౌట్లు తగ్గాయని తెలిపారు.

మనుబోలు హైస్కూలును స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ కింద అభివృద్ధి చేయడానికి క్రీడా వసతుల కోసం రూ.45 లక్షల ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. అలాగే ఎస్.ఈ.ఐ.ఎల్ కంపెనీ సీఎస్ఆర్ నిధులతో నియోజకవర్గ అభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.

వెంకటాచలం, పొదలకూరు సామాజిక ఆరోగ్య కేంద్రాలకు రూ.1.80 కోట్ల విలువైన వైద్య పరికరాలు అందించిందని చెప్పారు. అలాగే బ్రహ్మదేవంలో రూ.20 కోట్లతో ఆధునిక ఆస్పత్రి నిర్మాణం చేపడుతున్నారని తెలిపారు. ఈ ఆస్పత్రిలో అన్ని వైద్య సేవలు, మందులు, చికిత్సలు ఉచితంగా అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. నర్సింగ్ కళాశాల కూడా ఏర్పాటు చేసి ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు.

మల్లికార్జునపురంలో 280 కుటుంబాలను దత్తత తీసుకుని వారి అభ్యున్నతికి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. అదానీ ఫౌండేషన్ ముత్తుకూరు, కృష్ణపట్నం పంచాయతీలను దత్తత తీసుకుని అభివృద్ధి పనులు చేపడుతోందని తెలిపారు.

కృష్ణపట్నంలోని తుఫాన్ షెల్టర్‌ను స్కిల్ డెవలప్మెంట్ సెంటర్‌గా మార్చుతున్నట్లు చెప్పారు. అలాగే ప్రవాస భారతీయుడు ప్రేమసాగర్ రెడ్డి తమ స్వగ్రామమైన నిడిగుంటపాళెంలో నిర్మించిన భవనంలో కూడా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.

పిల్లల భవిష్యత్తు కోసం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని, విద్యార్థులు అందిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకుని మంచి భవిష్యత్తు సాధించాలని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పిలుపునిచ్చారు.

హాస్టళ్లలో మరుగుదొడ్లు వంటి వసతుల కోసం నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. బీసీ హాస్టల్ భవన నిర్మాణానికి రూ.3 కోట్లు మంజూరయ్యాయని చెప్పారు. విద్యార్థులు ఈ అవకాశాలను ఉపయోగించుకుని చదువులో రాణించి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు.