తాజా వార్తలు
True Times India
ఎడిటర్: SV || Anantapur Andhra Pradesh Crime Heritage March 05, 2026

పెన్నాహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం

|
ఈ-పేపర్ ప్రింట్ (PDF)

Penna Ahobilam Lakshmi Narasimha Swamy Templeపెన్నాహోబిలం విగ్రహాల చోరీపై ‘పిచ్చి’ రాతలు: భక్తుల ఆగ్రహం

ఉరవకొండ/పెన్నాహోబిలం: చారిత్రక ప్రాధాన్యం గల పెన్నాహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో గతంలో చోటుచేసుకున్న విగ్రహాల చోరీ ఘటన మరోసారి చర్చనీయాంశమైంది. ఈ ఘటనపై ఒక వర్గం పత్రిక ప్రచురించిన కథనం భక్తుల్లో తీవ్ర ఆగ్రహానికి దారి తీసింది. దొంగతనాన్ని చిన్నచూపు చూస్తూ, వాస్తవాలను వక్రీకరిస్తూ కథనం రాసారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. “ఇది కేవలం లోహపు వస్తువుల చోరీ కాదు.. వారసత్వ సంపదపై దాడి” అని భక్తులు గట్టిగా ప్రశ్నిస్తున్నారు.
విజయనగర సామ్రాజ్య కాలానికి చెందిన, సదాశివరాయల యుగం నాటి బంగారు, పంచలోహ విగ్రహాలు చోరీకి గురైనట్లు అప్పట్లో నమోదు అయిన కేసులో, ఎఫ్‌.ఐ.ఆర్‌లో వాటి విలువను కేవలం రూ.50 వేలుగా పేర్కొనడం ఇప్పటికీ అనేక అనుమానాలకు తావిస్తోంది. వందల ఏళ్ల చరిత్ర కలిగిన, రాజముద్ర ఉన్న విగ్రహాల విలువను ఇంత తక్కువగా ఎలా అంచనా వేశారని భక్తులు ప్రశ్నిస్తున్నారు. ఈ మొత్తం విగ్రహాల తయారీ లేదా మరమ్మతులకు ముప్పై ఏళ్ల క్రితం ఖర్చయిన మొత్తం మాత్రమే అయి ఉండవచ్చని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. కానీ ఆ వివరాలను పక్కనపెట్టి, రూ.50 వేల విలువే అసలు విగ్రహాల ధర అన్నట్లు ప్రచారం చేయడం బాధాకరమని వారు అంటున్నారు.
చారిత్రక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక ప్రాధాన్యం గల విగ్రహాల విలువను కేవలం బంగారం, పంచలోహం ధరతో కొలవడం సరైంది కాదని చరిత్రాభిమానులు స్పష్టం చేస్తున్నారు. ఒకవేళ అదే విధంగా చూస్తే శతాబ్దాలనాటి శిల్పాలు, రాజవంశాల ముద్రలు, దేవాలయ సంప్రదాయాలన్నీ కేవలం లోహపు ముక్కలుగా మారిపోతాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా కథనాలు రాయడం పత్రికా విలువలకు విరుద్ధమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
చోరీ జరిగిన సమయంలో విధులు నిర్వర్తించిన ఈవో మాధవశెట్టి తీరుపై కూడా ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఇంతటి విలువైన విగ్రహాలు మాయమైతే, తక్షణమే గట్టి చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఉందని భక్తులు గుర్తుచేస్తున్నారు. అయితే కేసు పురోగతి లేకుండా చివరికి ‘అన్ డిటెక్టబుల్ క్రైమ్’గా ముగియడం వెనుక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈవో స్వయంగా ఫిర్యాదు చేయాల్సింది పోయి, ఇతరుల ద్వారా ఫిర్యాదు చేయించడం వెనుక ఉన్న కారణాలేమిటో వెల్లడించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
ఇక ఇటీవల ప్రచురితమైన కథనంపై కూడా విమర్శలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. క్షేత్రస్థాయి వాస్తవాలను తెలుసుకోకుండా, గతంలో ప్రధాన అర్చకులపై జరిగిన వివాదాలు, కుట్రల నేపథ్యం పరిశీలించకుండా, కేవలం ఒక కోణంలోనే కథనం రాయడం బాధ్యతారాహిత్యమని స్థానిక విలేఖరులు పేర్కొంటున్నారు. ఒక ప్రముఖ దేవాలయానికి సంబంధించిన సున్నితమైన అంశాన్ని అరకొర సమాచారంతో ప్రచారం చేయడం సమాజంలో అపోహలు పెంచుతుందని వారు హెచ్చరిస్తున్నారు.
పెన్నాహోబిలం క్షేత్రం చుట్టుపక్కల వందలాది గ్రామాలకు ఆధ్యాత్మిక కేంద్రం. మాజీ హైకోర్టు చీఫ్ జస్టిస్ సహా పలువురు ప్రముఖులకు కూడా ఈ క్షేత్రం ఇలవేల్పుగా ఉంది. అలాంటి క్షేత్రంలో విగ్రహాల చోరీ ఘటనను చిన్నచూపు చూడటం, దానిపై ప్రశ్నించిన వారినే ‘దుష్ప్రచారం’ చేస్తున్నారని ముద్రవేయడం సమంజసం కాదని భక్తులు అంటున్నారు. నిజానిజాలు వెలుగులోకి రావాలంటే పారదర్శక విచారణ అవసరమని వారు డిమాండ్ చేస్తున్నారు.
దేవాలయాల భద్రత, వారసత్వ సంపద పరిరక్షణ విషయంలో ప్రభుత్వాలు, అధికారులు, స్థానిక ప్రజలు అందరూ సమిష్టిగా బాధ్యత వహించాల్సిన సమయం ఇదే అని విశ్లేషకులు సూచిస్తున్నారు. దేవుని సొమ్ము, భక్తుల నమ్మకం — ఈ రెండింటితో ఆడుకోవడం ఎవరికీ శ్రేయస్కరం కాదని వారు హెచ్చరిస్తున్నారు. పెన్నాహోబిలం వంటి చారిత్రక క్షేత్రాల విషయంలో రాజకీయాలకు అతీతంగా స్పందించి, బాధ్యులపై చర్యలు తీసుకొని, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు చేపట్టాలని భక్తులు కోరుతున్నారు.