తాజా వార్తలు
True Times India
ఎడిటర్: SV || Andhra Pradesh Uravakonda March 13, 2026

55 వేల జనాభా ఉన్న పట్టణంలో కేవలం రెండే చలివేంద్రాలా?

|
ఈ-పేపర్ ప్రింట్ (PDF)

  

  సేవను మరిచిన స్వచ్ఛంద సంస్థలు.. బాధ్యత లేని పంచాయతీ యంత్రాంగం!

 * పుట్టినరోజు వేడుకల నెపంతో 'జై కిసాన్' ద్వంద్వ లబ్ధి?

ఉరవకొండ : భానుడు భగభగలాడుతున్నాడు.. పట్టణంలో ఎండలు మండుతున్నాయి. కానీ, బాటసారుల దాహార్తిని తీర్చే చలివేంద్రాల ఏర్పాటుపై మాత్రం ఉరవకొండలోని ప్రముఖులు, అధికారులు మౌనం వహిస్తున్నారు. సుమారు 55 వేల జనాభా కలిగిన ఈ పట్టణంలో నేటి వరకు కేవలం రెండు చలివేంద్రాలు మాత్రమే ఏర్పాటు కావడం ఇక్కడి సామాజిక బాధ్యతారాహిత్యానికి అద్దం పడుతోంది.

ఒక దెబ్బకు రెండు పిట్టలు: 'జై కిసాన్' సేవ!

స్థానిక జై కిసాన్ ఫౌండేషన్ శుక్రవారం ఒక చలివేంద్రాన్ని ఏర్పాటు చేసింది. అయితే, ఈ ఏర్పాటు వెనుక ఒక వింతైన వ్యూహం కనిపిస్తోంది. ఫౌండేషన్ కుటుంబానికి చెందిన నాగమల్లి మనస్వి, నాగమల్లి అక్రాంత్ ఋషి అనే ఇద్దరు పిల్లల పుట్టినరోజులు ఒకే రోజు కావడంతో, ఆ వేడుకలను పురస్కరించుకుని ఈ చలివేంద్రాన్ని ప్రారంభించారు. "ఒక దెబ్బకు రెండు పిట్టలు" అన్న చందంగా.. ఇటు పిల్లల పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటూనే, అటు సేవ ముసుగులో సంస్థ ప్రచారం కోసం వేంపర్లాడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. బహిరంగ ప్రదేశాల్లో కాకుండా తన షాపు ముంగిట చలివేంద్రం ఏర్పాటు చేయడంపై చర్చ సాగుతోంది.

ఈ కార్యక్రమంలో లయన్ సత్యాన్న, నాగేశ్వరరావు, శ్రీధర్, ఆయుర్ అధ్యక్షులు సుధాకర్, పోలీస్ బాలు, వార్డ్ కౌన్సిలర్ నిరంజన్ గౌడ్ తదితరులు పాల్గొని పిల్లలకు శుభాకాంక్షలు తెలిపారు.

నిద్రపోతున్న పంచాయతీ.. విస్మరించిన లయన్స్ క్లబ్!

మరోవైపు, పంచాయతీ యంత్రాంగం తీరు విమర్శలకు తావిస్తోంది. రథోత్సవానికి గజమాలలు సమర్పించడంలో చూపిన ఉత్సాహం, ప్రజల దాహార్తిని తీర్చే చలివేంద్రాల ఏర్పాటులో చూపకపోవడం సిగ్గుచేటు. లక్షలాది రూపాయల విలువైన పంచాయతీ స్థలాలను పొందిన వారు సైతం కనీసం ఒక కుండ నీరు పెట్టకపోవడం వారి సామాజిక స్పృహను ప్రశ్నిస్తోంది. ఇక లయన్స్ క్లబ్ నిర్వాహకులకైతే అసలు చలివేంద్రాల మాటే మరిచిపోయినట్లున్నారు. వేసవి కాలం ముగిశాక ఏర్పాటు చేస్తారేమోనని ప్రజలు ఎద్దేవా చేస్తున్నారు.

తాగునీరు ఉన్నా.. కుండలు లేవు!

ఉమ్మడి నియోజకవర్గ నేత పయ్యావుల కేశవ్ పుణ్యమా అని ఉరవకొండలో తాగునీటి సరఫరా సమృద్ధిగానే ఉంది. నీరు ఉన్నా.. ప్రధాన కూడళ్లలో కుండలు, బాణలు ఏర్పాటు చేసే నాథుడే కరువయ్యారు. పట్టణం అంతటికీ కలిపి కేవలం రెండు చలివేంద్రాలే ఉండటం కొసమెరుపు. ఇప్పటికైనా అభివృద్ధి కాముకులు, స్వచ్ఛంద సేవా సంస్థలు, రాజకీయ నాయకులు మరియు విద్యార్థి సంఘాలు స్పందించి, ప్రజల కోసం చలివేంద్రాలను ఏర్పాటు చేయాలని ఉరవకొండ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.