కదం తొక్కిన రాయలసీమ జోనల్ బీఎస్పీ శ్రేణులు.. బీసీలకు బహుజన సమాజ్ పార్టీతోనే న్యాయం: వక్తలు
ఆదోని:బహుజన్ సమాజ్ పార్టీ (BSP) వ్యవస్థాపకులు మాన్యవర్ కాన్షీరామ్ 92వ జయంతి ఉత్సవాలను కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. రాయలసీమ జోనల్ స్థాయిలో జరిగిన ఈ సభకు ఆరు జిల్లాల నుండి పార్టీ రాష్ట్ర కార్యదర్శులు, జిల్లా ఇన్‌ఛార్జులు, అధ్యక్షులు, నియోజకవర్గ, మండల కమిటీ సభ్యులు మరియు వేలాది మంది కార్యకర్తలు తరలివచ్చారు.
కదం తొక్కిన ర్యాలీ
కార్యక్రమంలో భాగంగా స్థానిక శ్రీనివాస్ కూడలిలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం అక్కడి నుంచి భారీ డీజే సౌండ్ల మధ్య ఉత్సాహంగా ర్యాలీ నిర్వహించారు. శ్రీనివాస్ కూడలి వద్ద ఏర్పాటు చేసిన మాన్యవర్ కాన్షీరామ్ భారీ కటౌట్‌కు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఓటు రాజ్యాన్ని నిరూపించిన మహనీయుడు
ఈ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆర్.జె. మల్లెకల్లు మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల రాజ్యాధికారం కోసం బీఎస్పీని స్థాపించి, దళిత బహుజనులకు స్వంత పార్టీని అందించిన మహోన్నత వ్యక్తి కాన్షీరామ్ అని కొనియాడారు. బాబాసాహెబ్ అంబేద్కర్ కలలు కన్న 'ఓటు రాజ్యం' ఎలా ఉంటుందో చేసి చూపించారని గుర్తుచేశారు.
బీసీలకు నిజమైన రాజ్యాధికారం
మరొక ముఖ్య అతిథి చిందనూరు నాగరాజు ప్రసంగిస్తూ.. బీసీలకు నిజమైన రాజ్యాధికారం కేవలం బహుజన సమాజ్ పార్టీతోనే సాధ్యమని ఉద్ఘాటించారు. బీసీలంతా చైతన్యవంతమై బహుజన రాజ్యం తీసుకురావడానికి ఐక్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. సభ నిర్వాహకులు మంచాల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. బీఎస్పీ అనేది దళిత, బహుజన, మైనారిటీ ఉద్యోగులకు ఒక రక్షణ గోడ లాంటిదని, పార్టీ ఎంత బలోపేతమైతే వారి హక్కులకు అంత భద్రత ఉంటుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు గోవిందరాజులు, వాల్మీకి బోయ రవికుమార్, కమలే గణేష్, బతుకన్న, ఈరన్న నాయుడు, రాష్ట్ర కార్యదర్శులు గద్దల నాగభూషణం, గోవిందు, శ్రీరాములు, జిల్లా ఇన్‌ఛార్జులు గాడి అరుణ్ కుమార్, మౌలాలి, ఓబయ్య, కర్నూల్ సిటీ కన్వీనర్ సాదిక్ భాష, జిల్లా అధ్యక్షులు గుదిపి సామేలు, కాసాని నాగరాజు, యుగంధర్, లాజర్, నాగరాజులతో పాటు భారీ సంఖ్యలో సెక్టార్, బూత్ కమిటీ కార్యకర్తలు పాల్గొన్నారు.

