తాజా వార్తలు
True Times India
ఎడిటర్: SV || Andhra Pradesh Rayadurgam March 20, 2026

డ్రగ్స్ నియంత్రణలో ప్రభుత్వం విఫలం: AIYF ఆగ్రహం

|
ఈ-పేపర్ ప్రింట్ (PDF)
రాయదుర్గం: రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి వంటి మాదకద్రవ్యాల నియంత్రణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అఖిల భారత యువజన సమాఖ్య (AIYF) అనంతపురం జిల్లా సమితి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. డ్రగ్స్ ప్రభావంతో యువత జీవితాలు సర్వనాశనం అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది.
డ్రగ్స్ కేసులో పట్టుబడిన తెలుగుదేశం పార్టీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్‌ను వెంటనే సస్పెండ్ చేసి, కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు రాయదుర్గం పట్టణంలోని ఏపీఎన్జీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో AIYF జిల్లా అధ్యక్షుడు కావలి కోట్రేష్ మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రగ్స్ కేసులో ఒక ప్రజాప్రతినిధి పట్టుబడటం అత్యంత దురదృష్టకరమని, ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన వారు ఇలాంటి అక్రమాల్లో చిక్కుకోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని పేర్కొన్నారు. ఈ ఘటన రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిందన్నారు.
యువతను మత్తు పదార్థాల నుంచి దూరంగా ఉండాలని చెప్పే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఈ ఘటనపై ఏమి సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ఈ ఘటనపై పూర్తి నైతిక బాధ్యత వారిదేనని అన్నారు.
డ్రగ్స్ వినియోగం సమాజాన్ని నాశనం చేసే ప్రమాదకర సమస్యగా మారుతోందని, యువత భవిష్యత్తును కాపాడేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. డ్రగ్స్ కేసుల్లో పట్టుబడిన వారికి ఎలాంటి రాజకీయ పరిరక్షణ లేకుండా చట్టపరంగా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
ఈ కేసుపై పూర్తి స్థాయి విచారణ జరిపి నిజనిజాలను ప్రజలకు వెల్లడించాలని ప్రభుత్వం, దర్యాప్తు సంస్థలను డిమాండ్ చేశారు. డ్రగ్స్‌కు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా పోరాటాన్ని కొనసాగిస్తూ, యువతలో అవగాహన పెంచేందుకు కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అధ్యక్షుడు కుమార్, కోశాధికారి నాగయ్య, నాయకులు గంగాధర్, అశోక్, దినకర్ తదితరులు పాల్గొన్నారు.