అమల్లోకి ముఖ హాజరు – ఫాలో కాకుంటే డబ్బులు రావు.
ఉపాధి హామీ పథకంలో కీలక మార్పులు అమల్లోకి వచ్చాయి. భారత ప్రభుత్వం అక్రమాలకు చెక్ పెట్టేందుకు కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది. ఇకపై ఉపాధి హామీ కూలీలకు ఫేషియల్ అథెంటికేషన్ (ముఖ హాజరు) తప్పనిసరి చేసింది. మార్చి 2వ తేదీ (సోమవారం) నుంచి ఈ విధానాన్ని కచ్చితంగా అమలు చేయాలని అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లోనూ కొత్త పద్ధతి అమల్లోకి రానుంది.
గతంలో జాబ్ కార్డులో ఒకరి పేరు ఉండగా మరొకరు పనులకు వెళ్లడం, మస్టర్ రోల్స్‌లో దొంగ సంతకాలు చేయడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ అక్రమాలను అరికట్టడమే లక్ష్యంగా కేంద్రం ఈ-కేవైసీ విధానాన్ని తీసుకువచ్చింది. ఉపాధి హామీ నిధులు దుర్వినియోగం కాకుండా ప్రతి కూలీకి ఈ-కేవైసీ పూర్తి చేయడం తప్పనిసరి చేసింది. 2025 అక్టోబర్‌లో ప్రారంభమైన ఈ ప్రక్రియలో మెజారిటీ కూలీల ఈ-కేవైసీ పూర్తయినట్లు అధికారులు చెబుతున్నారు.
కొత్త విధానం ప్రకారం పని ప్రదేశంలోనే ప్రతి కూలీకి ప్రత్యేక ఐడీ సృష్టిస్తారు. ఫీల్డ్ అసిస్టెంట్ లేదా టెక్నికల్ అసిస్టెంట్ కూలీల ఫోటోలను మొదట తీస్తారు. పని ప్రారంభించిన నాలుగు గంటల తర్వాత మరోసారి ఫోటో తీసి యాప్‌లో అప్లోడ్ చేస్తారు. ఈ రెండు దశల్లో ఏదైనా మిస్ అయితే ఆ రోజు చేసిన పనికి బిల్లులు జమకావు. దీంతో హాజరు నమోదులో పారదర్శకత పెరుగుతుందని అధికారులు అంటున్నారు.
అయితే అమల్లో సవాళ్లు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా మారుమూల గ్రామాల్లో నెట్‌వర్క్ సిగ్నల్ సమస్య తీవ్రంగా ఉంది. ఫేసియల్ రికగ్నిషన్ యాప్ వెంటనే పనిచేయకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో పని ప్రదేశంలో ఫోటోలు తీసి, సిగ్నల్ ఉన్న ప్రాంతానికి వెళ్లి అప్లోడ్ చేయాలని ఫీల్డ్ సిబ్బందికి సూచనలు ఇచ్చారు.
ఉపాధి హామీ పథకంలో పారదర్శకత, నిజమైన లబ్ధిదారులకు వేతనాల చేరిక లక్ష్యంగానే ఈ విధానాన్ని తీసుకువచ్చినట్లు అధికారులు స్పష్టం చేస్తున్నారు. ముఖ హాజరు అమలుతో అక్రమాలకు పూర్తిగా చెక్ పడుతుందని, వేతనాలు సకాలంలో కూలీల ఖాతాల్లో జమవుతాయని వారు చెబుతున్నారు. అయితే గ్రామీణ ప్రాంతాల్లో సాంకేతిక సమస్యలు పరిష్కరించడమే ఇప్పుడు పెద్ద సవాల్‌గా మారింది.
కూలీలకు సూచన: ఈ-కేవైసీ పూర్తి చేసుకుని, పని ప్రదేశంలో రెండు సార్లు ఫోటో హాజరు నమోదు చేయించుకోవడం తప్పనిసరి. లేకపోతే వేతనాలు నిలిచిపోయే ప్రమాదం ఉంది.
