శ్రీరంగరాజుపురం: రైతు కంట కారిన ఒక్క కన్నీటి చుక్క కూడా ప్రభుత్వాల భవిష్యత్తును మార్చగలదని, రైతులను నిర్లక్ష్యం చేసే ప్రభుత్వాలు నిలవవని మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి హెచ్చరించారు. శ్రీరంగరాజుపురం మండలం ఎగువ కమ్మ కండ్రిగ పంచాయతీ పరిధిలోని మెట్ట హరిజనవాడ గ్రామంలో అగ్నిప్రమాదానికి గురైన చెరుకు తోటను ఆయన పరిశీలించారు.
గ్రామానికి చెందిన దళిత రైతు నవీన్‌కు చెందిన దాదాపు ఐదు ఎకరాల చేతికొచ్చిన చెరుకు తోట అగ్నికి ఆహుతైంది. అదనంగా రెండు గానుగ షెడ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. మార్కెట్‌కు తరలించేందుకు సిద్ధంగా ఉంచిన సుమారు రూ.3 లక్షల విలువైన బెల్లం కూడా కాలిపోయింది. ఈ ఘటనతో రైతు కుటుంబం ఆర్థికంగా తీవ్ర ఇబ్బందుల్లో పడింది.
సంఘటన విషయం తెలిసిన వెంటనే మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి, గంగాధర్ నెల్లూరు వైఎస్ఆర్సిపి ఇన్‌చార్జి కృపా లక్ష్మి ఘటనాస్థలికి చేరుకుని బాధిత రైతును పరామర్శించారు. బోరున విలపిస్తున్న కుటుంబ సభ్యులను ఓదార్చి, ధైర్యం చెప్పారు. రైతుల కన్నీటిని తుడుస్తూ “ఎవ్వరూ ధైర్యం కోల్పోవద్దు… అన్ని విధాలుగా అండగా ఉంటాం” అని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా నారాయణస్వామి మాట్లాడుతూ, జిల్లాస్థాయి వ్యవసాయ శాఖ అధికారులు, రెవెన్యూ అధికారులు ఇప్పటివరకు ఘటనాస్థలిని సందర్శించకపోవడం దారుణమని విమర్శించారు. దళిత రైతు నష్టపోయినా అధికారులు స్పందించకపోవడం బాధాకరమన్నారు. జిల్లా కలెక్టర్ మానవతా దృక్పథంతో వెంటనే స్పందించి, అగ్నికి ఆహుతైన చెరుకు తోటను పరిశీలించి రైతుకు తగిన నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు.
రైతు కంట కన్నీరు కారిస్తే ఏ ప్రభుత్వమైనా కూలిపోవాల్సిందేనని ఆయన వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వంలో అడుగడుగునా రైతులకు అన్యాయం జరుగుతోందని, ఎక్కడా న్యాయం జరిగిన దాఖలాలు కనిపించడంలేదన్నారు. గతంలో జగనన్న ప్రభుత్వ హయాంలో వైఎస్సార్ పంట బీమా, వైఎస్సార్ ఇన్‌పుట్ సబ్సిడీ పథకాల ద్వారా నష్టపోయిన రైతులకు తక్షణ సహాయం అందేదని గుర్తుచేశారు. ప్రస్తుతం పథకాల పేర్లు మారినా రైతులకు మేలు జరగడంలేదని విమర్శించారు.
“అధికారం కోసం రైతుల ఓట్లు కావాలి… కానీ రైతులకు అన్యాయం జరిగితే ఎవరూ ముందుకు రావడం లేదు. ఇదే తీరును కొనసాగిస్తే రాష్ట్ర ప్రజలు తిరగబడతారు” అని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రైతులకు న్యాయం జరిగేంతవరకు కూటమి ప్రభుత్వంతో పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
భవిష్యత్తులో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నష్టపోయిన రైతులకు పూర్తి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. “మాటిచ్చి తప్పే రకం కాదు” అని రైతులకు భరోసా కల్పించారు.
ఈ సందర్భంగా మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి, ఇన్‌చార్జి కృపా లక్ష్మి, జిల్లా క్రియాశీలక కార్యదర్శి విజయబాబు తమ వంతుగా ఆర్థిక సహాయం అందజేశారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా వైఎస్ఆర్సిపి ఉపాధ్యక్షులు గురువారెడ్డి, జిల్లా బూత్ కన్వీనర్ వెంకటేశ్వర్ రెడ్డి, ఎంపీపీ సరిత జనార్ధన్, సర్పంచ్ కుమారి బాబు, ఎంపీటీసీ సభ్యులు చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
