తాజా వార్తలు
True Times India
ఎడిటర్: SV || Uravakonda March 16, 2026

ఉపాధి హామీ అవినీతిపై ‘కౌలు రైతు సంఘం’ గర్జన: తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా

|
ఈ-పేపర్ ప్రింట్ (PDF)

ఉరవకొండ: ఉపాధి హామీ పథకంలో జరిగిన భారీ అవినీతిపై చర్యలు తీసుకోవాలని, అక్రమాలకు పాల్పడిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో సోమవారం ఉరవకొండ తహసీల్దార్ కార్యాలయం వద్ద భారీ ధర్నా నిర్వహించారు. అనంతరం తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు.

79 లక్షల అవినీతి.. రికవరీ మాత్రం వేలల్లోనే!

ఈ సందర్భంగా కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు రంగారెడ్డి, నియోజకవర్గ కార్యదర్శి పెద్దముష్టూరు వెంకటేష్ మాట్లాడుతూ.. ఉపాధి హామీ పథకం పేదలకు, కౌలు రైతులకు ఒక వరం లాంటిదని, అయితే దీన్ని కొందరు స్వార్థపరులు అడ్డగోలుగా దోచుకుంటున్నారని మండిపడ్డారు. గత సామాజిక తనిఖీల్లో సుమారు 79 లక్షల రూపాయల అవినీతి జరిగినట్లు తేలినా, అధికారులు ఇప్పటి వరకు కేవలం 61 వేల రూపాయలు మాత్రమే రికవరీ చేయడం సిగ్గుచేటని విమర్శించారు.

అక్రమార్కులకు అధికారుల అండ?

పట్టణాల్లో వ్యాపారాలు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు చేసేవారు, చివరకు ప్రజాప్రతినిధులు కూడా పనులు చేయకుండానే బిల్లులు డ్రా చేసుకున్నారని వారు ఆరోపించారు. ఇంత పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినా జిల్లా అధికారులు ఎందుకు మౌనంగా ఉన్నారని, అక్రమార్కులపై క్రిమినల్ కేసులు ఎందుకు నమోదు చేయడం లేదని ప్రశ్నించారు. అధికారుల ఉదాసీనత వల్ల చట్టం ఉద్దేశం నీరుగారిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

సామాజిక తనిఖీలు ‘తూతూ మంత్రం’

గ్రామాల్లో జరుగుతున్న సామాజిక తనిఖీలు (Social Audit) కేవలం నామమాత్రంగా సాగుతున్నాయని, ఎస్‌ఆర్‌పీలు (SRP), డీఆర్‌పీలు (DRP) అవినీతిపరులకు కొమ్ముకాస్తున్నారని నేతలు ఆరోపించారు. "కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు" తనిఖీ బృందాల తీరు ఉందని ఎద్దేవా చేశారు. తక్షణమే పూర్తిస్థాయిలో రికవరీ చేపట్టి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోకపోతే దశలవారీగా ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు సిద్ధప్ప, సీనప్ప, కౌలు రైతు సంఘం నాయకులు సుంకన్న, నారాయణ, కుల్లాయప్ప, తిప్పమ్మ, ఎర్రమ్మ, రామన్న, సీనప్ప తదితరులు పాల్గొన్నారు.