తాజా వార్తలు
True Times India
ఎడిటర్: SV || Andhra Pradesh Uravakonda March 15, 2026

ఉరవకొండలో ఆగని 'అక్రమ' దందా: రహదారుల కబ్జా.. అనుమతి లేని బహుళ అంతస్తులు!

|
ఈ-పేపర్ ప్రింట్ (PDF)

ఉరవకొండ : ఉరవకొండ పట్టణంలో పంచాయతీ పాలన పూర్తిగా పడకేసింది. నిబంధనలు గాలికి వదిలేసి, రహదారులను కబ్జా చేస్తూ.. ఎటువంటి అనుమతులు లేని బహుళ అంతస్తుల భవనాలు యథేచ్ఛగా వెలుస్తున్నాయి. అధికారుల కళ్లముందే అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా, వారు 'మొద్దునిద్ర' నటిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రభుత్వ స్థలమే లక్ష్యంగా కబ్జాలు
ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఎన్టీఆర్ విగ్రహ సర్కిల్ పక్కన ఉన్న విలువైన భూమిపై కొందరు కబ్జాదారులు కన్నేశారు. విద్యాసంస్థలకు వెళ్లే ప్రధాన రహదారిని ఆక్రమించి బంకులు ఏర్పాటు చేస్తున్నారు. సామాన్యుడు చిన్న ఇల్లు కట్టుకుంటే నోటీసులు ఇచ్చే అధికారులు, కోట్లాది రూపాయల విలువైన ప్రజా ఉపయోగ స్థలాలు కబ్జా అవుతున్నా పట్టించుకోకపోవడం వెనుక అసలు రహస్యం ఏమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.

 నిబంధనలు బేఖాతరు చేస్తున్న ప్రభుత్వ డాక్టర్!

అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన ఒక ప్రభుత్వ డాక్టరే స్వయంగా అక్రమ నిర్మాణానికి పూనుకోవడం చర్చనీయాంశంగా మారింది.

 * నో అహుడా (AHUDA) పర్మిషన్: ఎటువంటి అనుమతులు లేకుండానే బహుళ అంతస్తుల ప్రైవేటు ఆసుపత్రి నిర్మాణం సాగుతోంది.

 * ఆదేశాల ఉల్లంఘన: జిల్లా సహచ కార్యదర్శి మధుబాబు ఫిర్యాదు మేరకు ఉన్నతాధికారులు సదరు డాక్టరుకు నోటీసులు జారీ చేసినా, ఆయన వాటిని తుంగలో తొక్కారు.

 * ముడుపుల ఆరోపణలు: ఉన్నతాధికారుల ఆదేశాలను సైతం లెక్కచేయకుండా నిర్మాణం కొనసాగిస్తున్నారంటే, స్థానిక స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు భారీగా ముడుపులు అందాయనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.

లోకాయుక్త నివేదికలతో ముప్పు తప్పదు!

ఈ అవినీతి భాగోతంపై జిల్లా సహచ కార్యదర్శి మీనుగ మధుబాబు తీవ్రంగా స్పందించారు. అక్రమాలను అడ్డుకోవడంలో విఫలమైన అధికారులు తగు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఇప్పటికే లోకాయుక్తకు ఫిర్యాదు చేసినట్లు, అవినీతి అక్రమాలపై నివేదికలు సిద్ధమవుతున్నాయని ఆయన పేర్కొన్నారు.

> "పంచాయతీ పాలకులు, అధికారులు ఇప్పటికైనా మొద్దునిద్ర వీడాలి. ప్రజా ఆస్తులను కాపాడకపోతే చట్టపరమైన చర్యలు తప్పవు." - మధుబాబు, జిల్లా సహచ కార్యదర్శి.