తాజా వార్తలు
True Times India
ఎడిటర్: SV || Andhra Pradesh Kurnool March 08, 2026

హైకోర్టు బెంచ్ సాధనకు బార్ ఎన్నికలు కీలకం - అడ్వకేట్ జి.వి.కృష్ణమూర్తి

|
ఈ-పేపర్ ప్రింట్ (PDF)

కర్నూలు: రాయలసీమ ప్రజల చిరకాల స్వప్నమైన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బెంచ్ కర్నూలుకు రావాలంటే రాబోయే బార్ అసోసియేషన్ ఎన్నికలు కీలకమని ‘కర్నూలు హైకోర్టు సాధన సమితి’ ప్రతినిధి, సీనియర్ న్యాయవాది జి.వి. కృష్ణమూర్తి పేర్కొన్నారు.
ఆయన మాట్లాడుతూ 2026–2027 సంవత్సరానికి గాను కర్నూలు జిల్లా బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మరియు ప్రధాన కార్యదర్శి పదవులకు మార్చి 30, 2026న ఎన్నికలు జరగనున్నట్లు తెలిపారు. ఈ ఎన్నికలు రాయలసీమ ప్రాంత ప్రజల ఆశయాలకు ఎంతో ప్రాధాన్యత కలిగినవని పేర్కొన్నారు.
హైకోర్టు బెంచ్ ఏర్పాటు అనేది కేవలం కోరితే సాధ్యమయ్యే విషయం కాదని, ప్రభుత్వాలపై నిరంతరం ఒత్తిడి తీసుకువచ్చేలా భారీ స్థాయి ఉద్యమాలు చేపట్టాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. రాయలసీమ ప్రాంతానికి న్యాయం జరగాలంటే న్యాయవాదులందరూ ఐక్యంగా పోరాటం చేయాల్సిన సమయం వచ్చిందని అన్నారు.
ఈ నేపథ్యంలో జరగనున్న బార్ అసోసియేషన్ ఎన్నికలు కీలక మలుపుగా మారనున్నాయని పేర్కొన్నారు. హైకోర్టు బెంచ్ సాధన కోసం ముందుండి పోరాటం చేయగల సమర్థులైన నాయకులను ఎన్నుకోవాల్సిన బాధ్యత న్యాయవాదులపై ఉందని తెలిపారు.
‘హైకోర్టు బెంచ్ కర్నూలుకు రావాలి’ అనే లక్ష్యంతో తాడోపేడో తేల్చుకునే స్థాయిలో పోరాటం చేసే నాయకత్వాన్ని ఎన్నుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తమ అమూల్యమైన ఓటును ఉద్యమానికి కట్టుబడి పనిచేసే అభ్యర్థులకు వేయాలని న్యాయవాదులను కోరారు.
రాయలసీమ ప్రాంత అభివృద్ధి, న్యాయ సేవల విస్తరణ దృష్ట్యా హైకోర్టు బెంచ్ ఏర్పాటు అత్యంత అవసరమని కృష్ణమూర్తి అన్నారు. కర్నూలు జిల్లాలోని న్యాయవాదులందరూ ఈ ఉద్యమానికి మద్దతు తెలుపుతూ సంఘీభావంగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు.
హైకోర్టు బెంచ్ సాధన కోసం అవసరమైతే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. రాయలసీమ ప్రజల ఆకాంక్ష నెరవేర్చే దిశగా న్యాయవాదులు ఐక్యంగా కృషి చేయాలని ఆయన కోరారు.