తాజా వార్తలు
True Times India
ఎడిటర్: SV || Anantapur Andhra Pradesh Uravakonda March 02, 2026

ఉరవకొండలో మద్యం మాఫియా ఆగడాలు హైవే రెస్టారెంట్లు, టవర్ క్లాక్ షాపులపై ఫిర్యాదు

|
ఈ-పేపర్ ప్రింట్ (PDF)

ఉరవకొండ : అనంతపురం–బళ్లారి జాతీయ రహదారి పరిధిలో మద్యం అక్రమాలపై సంచలన ఆరోపణలు వెల్లువెత్తాయి. ఉరవకొండ పట్టణంలో హైవే పక్కన ఉన్న కొన్ని రెస్టారెంట్లు, టవర్ క్లాక్ సమీపంలోని మద్యం దుకాణాలపై స్థానిక సామాజిక కార్యకర్త మీనుగ మధుబాబు లిఖితపూర్వక ఫిర్యాదు సమర్పించారు. నిబంధనలను బేఖాతరు చేస్తూ సాగుతున్న అక్రమాల వల్ల ప్రమాదాలు పెరుగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

అనంతపురం–బళ్లారి జాతీయ రహదారి వెంబడి ఉన్న పలు రెస్టారెంట్లు నిబంధనలకు విరుద్ధంగా ‘మద్యం అడ్డాలు’గా మారాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. వాహనదారులు అక్కడే మద్యం సేవించి స్టీరింగ్ పట్టుకోవడంతో ప్రమాదాలు పెరుగుతున్నాయని తెలిపారు. మోటార్ వాహనాల చట్టంలోని సెక్షన్ 185 ప్రకారం మద్యం సేవించి వాహనం నడపడం తీవ్ర నేరమని గుర్తుచేశారు.
హైవే పక్కనే మద్యం అందుబాటులో ఉండటం వల్ల డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు పెరిగే అవకాశం ఉందని, ప్రయాణికుల ప్రాణాలకు ముప్పు ఏర్పడుతోందని అన్నారు. తక్షణమే ఈ రెస్టారెంట్లపై ఆకస్మిక దాడులు నిర్వహించి, మద్యం సరఫరా మార్గాలను అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలను ముమ్మరం చేసి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
టవర్ క్లాక్ వద్ద ‘ధర’ దోపిడీ
పట్టణంలోని అత్యంత రద్దీ ప్రాంతమైన టవర్ క్లాక్ సమీపంలోని మద్యం దుకాణంలో అనేక ఉల్లంఘనలు జరుగుతున్నాయని ఆరోపించారు. ప్రభుత్వం నిర్ణయించిన MRP కంటే అధిక ధరలకు మద్యం విక్రయిస్తూ సామాన్యులను దోచుకుంటున్నారని పేర్కొన్నారు. నిర్దేశిత సమయాల కంటే ముందే దుకాణాలు తెరవడం, అర్థరాత్రి వరకు విక్రయాలు సాగించడం పరిపాటిగా మారిందని విమర్శించారు.
ఈ విషయంపై ఎక్సైజ్ శాఖ దృష్టి సారించి ధరల పట్టికలు స్పష్టంగా ప్రదర్శించేలా, సమయ పాలన కచ్చితంగా అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వినియోగదారుల హక్కులను కాపాడాల్సిన బాధ్యత అధికారులదేనని గుర్తుచేశారు.
విద్యార్థుల భద్రత ప్రశ్నార్థకం
మద్యం దుకాణం విద్యాసంస్థలకు సమీపంలో ఉండటం ఆందోళన కలిగిస్తోందని మధుబాబు పేర్కొన్నారు. కాలేజీ విద్యార్థినులు, పాదచారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. బహిరంగంగా మద్యం సేవించే వారు సృష్టిస్తున్న అలజడి వల్ల మహిళలు, విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారని అన్నారు. ఎక్సైజ్ నిబంధనల ప్రకారం విద్యాసంస్థల సమీపంలో మద్యం విక్రయం, బహిరంగ సేవనం నిషిద్ధమని గుర్తుచేశారు.

ఈ అక్రమాలపై స్పందించాలని కోరుతూ సర్కిల్ ఇన్స్పెక్టర్ (సివిల్), ఎక్సైజ్ ఇన్స్పెక్టర్లకు లిఖితపూర్వక ఫిర్యాదు అందజేశారు. పోలీసు, ఎక్సైజ్ శాఖలు సంయుక్తంగా చర్యలు చేపట్టి మద్యం మాఫియా ఆగడాలను అరికట్టాలని డిమాండ్ చేశారు.
తక్షణ చర్యలు తీసుకోకపోతే ఉన్నతాధికారుల దృష్టికి విషయం తీసుకెళ్లి ప్రజా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఉరవకొండలో మద్యం అక్రమాలపై అధికార యంత్రాంగం ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.