అనంతపురం, మార్చి 30: రాష్ట్రంలో పెరుగుతున్న నిరుద్యోగ సమస్యపై విద్యార్థి, యువజన సంఘాలు మరోసారి గళమెత్తాయి. ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, మెగా జాబ్ క్యాలెండర్ విడుదల, నిరుద్యోగ భృతి చెల్లింపు వంటి కీలక డిమాండ్లతో ఐక్య వేదిక ఆధ్వర్యంలో జాయింట్ కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.
ఏఐవైఎఫ్, ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, పీడీఎస్‌యూ, ఎన్‌ఎస్‌యూఐ, వైఎస్ఆర్‌యూఎస్‌యూ సంఘాల నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య రోజురోజుకీ తీవ్రంగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఉన్నత విద్య పూర్తిచేసిన లక్షలాది మంది యువతకు సరైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేకపోవడంతో వారు వలస కూలీలుగా మారి ఇతర రాష్ట్రాలు, గల్ఫ్ దేశాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.
ఎన్నికల సమయంలో ప్రభుత్వం నిరుద్యోగ సమస్య పరిష్కారానికి పలు హామీలు ఇచ్చినప్పటికీ, ఇప్పటివరకు వాటి అమలు కనిపించలేదని నాయకులు విమర్శించారు. రాష్ట్రంలో వేలాది ప్రభుత్వ పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ వాటి భర్తీలో నిర్లక్ష్యం కొనసాగుతోందని పేర్కొన్నారు. ఈ పరిస్థితి రాష్ట్ర భవిష్యత్తుకు ప్రమాద సంకేతమని వారు హెచ్చరించారు.
ఈ నేపథ్యంలో ఐక్య విద్యార్థి, యువజన సంఘాల తరఫున తమ డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ జాయింట్ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నిరుద్యోగ యువతకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
వినతిపత్రంలో ప్రధానంగా ఖాళీగా ఉన్న సుమారు 99 వేల ప్రభుత్వ పోస్టులను భర్తీ చేస్తూ మెగా జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని కోరారు. పోలీస్ శాఖలో 19 వేల పోస్టులను భర్తీ చేసి గరిష్ట వయోపరిమితిని 35 సంవత్సరాలకు పెంచాలని, అన్ని ప్రభుత్వ ఉద్యోగాలకు వయోపరిమితి పెంపు చేపట్టాలని డిమాండ్ చేశారు.
అర్హులైన నిరుద్యోగులకు నెలకు రూ.3,000 నిరుద్యోగ భృతి బకాయిలతో సహా చెల్లించాలని, విద్యుత్, దేవాదాయ, వ్యవసాయ, ఎక్సైజ్, మహిళా శిశు సంక్షేమం, అటవీ శాఖల్లో ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని కోరారు. వాలంటీర్లకు కనీసం రూ.10,000 గౌరవ వేతనం చెల్లిస్తూ విధుల్లోకి తీసుకోవాలని సూచించారు.
విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను తక్షణమే నిలిపివేయాలని, ఆర్టీసీ సంస్థలో ఖాళీలను భర్తీ చేసి సంస్థను పరిరక్షించాలని పేర్కొన్నారు. అలాగే పేద నిరుద్యోగ యువతకు ఉచిత స్టడీ సర్కిల్స్, స్టడీ మెటీరియల్ అందించడంతో పాటు స్వయం ఉపాధి దిశగా ప్రోత్సహించేందుకు శిక్షణ, ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు.
ఇటీవల తొలగించబడిన ఉద్యోగులకు ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కల్పించి వారి జీవనాధారాన్ని కాపాడాలని కూడా వినతిపత్రంలో పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు కొట్రేష్, ఏఐఎస్ఎఫ్ ప్రధాన కార్యదర్శి కుళాయి స్వామి, పీడీఎస్‌యూ జిల్లా కార్యదర్శి వీరేంద్ర, ఎన్‌ఎస్‌యూఐ జిల్లా అధ్యక్షుడు వినోద్, వైఎస్ఆర్‌యూఎస్‌యూ అధ్యక్షుడు చంద్రశేఖర్ యాదవ్, ఎస్ఎఫ్ఐ నగర అధ్యక్షుడు వంశీతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.