అమరావతి: ఏపీ డిప్యూటీ సీఎం, జనసేనాని పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా సోషల్ మీడియాలో (ఇన్‌స్టాగ్రామ్) చేసిన ఒక ఎమోషనల్ పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. పవన్ కళ్యాణ్, మెగాస్టార్ చిరంజీవి, నాగబాబులతో కలిసి ఉన్న అరుదైన ఫొటోలను ఆమె అభిమానులతో పంచుకుంటూ తన మనసులోని మాటలను వ్యక్తపరిచారు.
మెగా కుటుంబంలో నా ప్రయాణం..
సరిగ్గా 15 ఏళ్ల క్రితం మెగా కుటుంబంలోకి అడుగుపెట్టానని అన్నా లెజినోవా గుర్తుచేసుకున్నారు. "ఇంత పెద్ద ఫ్యామిలీలో నేను ఎలా ఇమడగలనో అని తొలుత కొంచెం భయపడ్డాను, నాకు ఏమీ అర్థం కాలేదు. ఎవరిని ఎలా పిలవాలో, ఎలా పలకరించాలో కూడా తెలిసేది కాదు. కానీ నా భర్త పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఎనలేని సహకారం, మద్దతుతో అన్నీ నేర్చుకున్నాను" అని ఆమె పేర్కొన్నారు.
చిరంజీవి, నాగబాబులే నా సోదరులు..
మెగా బ్రదర్స్ గురించి చెబుతూ ఆమె తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. "నిజానికి నాకు సొంత సోదరులు ఎవరూ లేరు. కానీ చిరంజీవి గారు, నాగబాబు గారి రూపంలో నేను నా అన్నయ్యలను చూసుకుంటున్నాను. వారి ఆప్యాయత నన్ను ఎంతో ఆకట్టుకుంది" అంటూ అన్నా లెజినోవా చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు మెగా అభిమానుల హృదయాలను గెలుచుకుంటున్నాయి.