తాజా వార్తలు
True Times India
ఎడిటర్: SV || Anantapur Andhra Pradesh Uravakonda March 13, 2026

కోనాపురంలో అమానుషం: కౌలు రైతు తోటలో డ్రిప్ పైపుల దహనం

|
ఈ-పేపర్ ప్రింట్ (PDF)



 * నాలుగు ఎకరాల్లో సాగుకు సిద్ధమైన రైతుకు రూ. 70 వేల నష్టం

 * బాధితుడిని ప్రభుత్వం ఆదుకోవాలి: ఏపీ కౌలు రైతుల సంఘం డిమాండ్

ఉరవకొండ : అప్పులు చేసి పంట పండిద్దామనుకున్న ఓ కౌలు రైతు ఆశలపై గుర్తుతెలియని వ్యక్తులు నిప్పులు పోశారు. ఉరవకొండ మండలం కోనాపురం గ్రామంలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

ఘటన వివరాలు

కోనాపురం గ్రామానికి చెందిన రాము అనే కౌలు రైతు, అహోబిలం దేవస్థానానికి చెందిన సుమారు నాలుగు ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాడు. ప్రస్తుత సీజన్‌లో టమోటా సాగు చేసేందుకు సిద్ధమై, పొలమంతా డ్రిప్ వైర్లు, పైపులు అమర్చుకున్నాడు. అయితే, శుక్రవారం తెల్లవారుజామున గుర్తుతెలియని దుండగులు ఉద్దేశపూర్వకంగా ఆ డ్రిప్ పైపులకు నిప్పు పెట్టారు. ఈ ప్రమాదంలో పైపులన్నీ పూర్తిగా కాలి బూడిదయ్యాయి. దీనివల్ల తనకు సుమారు 70 వేల రూపాయల వరకు నష్టం వాటిల్లిందని బాధితుడు కన్నీరుమున్నీరవుతున్నాడు.

ప్రభుత్వం ఆదుకోవాలి - పెద్దముస్తూరు వెంకటేశులు

ఈ ఘటనపై ఏపీ కౌలు రైతుల సంఘం నియోజకవర్గ నాయకుడు పెద్దముస్తూరు వెంకటేశులు తీవ్రంగా స్పందించారు. కష్టపడి పని చేసుకునే కౌలు రైతుపై ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడటం దుర్మార్గమన్నారు. తక్షణమే పోలీస్ అధికారులు రంగంలోకి దిగి నిందితులను పట్టుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రభుత్వం స్పందించి, నష్టపోయిన రైతుకు రాయితీపై వచ్చే డ్రిప్ పైపులను ఉచితంగా అందజేసి, ఆర్థికంగా ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.