తాజా వార్తలు
True Times India
ఎడిటర్: SV || Anantapur APSRTC Local News Transport Issues Uravakonda March 17, 2026

ఉరవకొండ ఆర్టీసీ ఆదాయానికి గండి – డిపో మేనేజర్ నిర్లక్ష్యంపై విమర్శలు

|
ఈ-పేపర్ ప్రింట్ (PDF)

ఉరవకొండ, మార్చి 18: స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌లో అనధికారిక వాహనాల ఆగడాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. బస్టాండ్ ఆవరణలోనే ప్రైవేట్ సీఎన్‌జీ వాహనాలు, కార్లు ప్రయాణీకులను ఎక్కించుకుంటున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ప్రత్యేకంగా ఉరవకొండ డిపో మేనేజర్ హంపన్న తీరుపై తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. గుంతకల్లు ఎంవీఐ రాజబాబు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసినప్పటికీ, వాటిని అమలు చేయడంలో డిపో స్థాయిలో చర్యలు తీసుకోకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించాల్సిన ప్రయాణీకులను ప్రైవేట్ వాహనాలు కళ్ల ముందే తీసుకెళ్తున్నా, అధికారులు స్పందించకపోవడం వల్ల సంస్థ ఆదాయానికి భారీ నష్టం జరుగుతోందని స్థానికులు అంటున్నారు.

ఇదే సమయంలో నిబంధనల ప్రకారం ట్యాక్సీలు నడుపుకునే వాహనదారులు తమ ఉపాధి దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్యపై పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ, డిపో మేనేజర్ నుంచి సరైన స్పందన లభించలేదని వారు ఆరోపిస్తున్నారు.

పోలీసు, రవాణా శాఖలతో సమన్వయం చేసి బస్టాండ్ ఆవరణను అక్రమ వాహనాల నుంచి ఖాళీ చేయాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ, అధికారుల నిష్క్రియాపరత్వం కారణంగా పరిస్థితి అదుపు తప్పుతున్నదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

"ఉరవకొండ డిపో చరిత్రలో ఇంతటి బలహీనమైన వ్యవహారం ఎప్పుడూ చూడలేదు" అంటూ కొందరు సామాజిక కార్యకర్తలు మండిపడుతున్నారు. సీఎన్‌జీ వాహనాల విషయంలో స్పష్టమైన చర్యలు తీసుకోకపోవడం అధికారుల అసమర్థతకు నిదర్శనమని అభిప్రాయపడుతున్నారు.

ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఉరవకొండ ఆర్టీసీ డిపోలో పరిస్థితిని చక్కదిద్దుతారా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ప్రయాణీకుల సౌకర్యం, ఆర్టీసీ ఆదాయం రక్షణ కోసం తక్షణ చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.