తాజా వార్తలు
True Times India
ఎడిటర్: SV || Anantapur Andhra Pradesh March 02, 2026

టవర్ క్లాక్ వద్ద మద్యం దుకాణం ఆగడాలు నిబంధనలు తుంగలో తొక్కుతున్నారని ఫిర్యాదు

|
ఈ-పేపర్ ప్రింట్ (PDF)

ఉరవకొండ:  ఉరవకొండ పట్టణంలోని టవర్ క్లాక్ సమీపంలో నడుస్తున్న మద్యం దుకాణం ఎక్సైజ్ నిబంధనలను బేఖాతరు చేస్తోందని స్థానిక నివాసి మీనుగ మధుబాబు ఆరోపించారు. ఈ మేరకు ఆయన సోమవారం జిల్లా కలెక్టర్, జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్‌కు లిఖితపూర్వక ఫిర్యాదు సమర్పించారు. ప్రజా హితం, విద్యార్థుల భద్రత దృష్ట్యా తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

దూర పరిమితి బేఖాతరు: ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ చట్టం ప్రకారం విద్యాసంస్థలు, దేవాలయాలకు కనీసం 100 మీటర్ల దూరంలో మద్యం దుకాణాలు ఉండాల్సి ఉంటుంది. అయితే టవర్ క్లాక్ సమీపంలోని ఈ దుకాణం కాలేజీ కాంపౌండ్ గోడకు ఆనుకుని నడుస్తోందని మధుబాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. విద్యార్థులు రాకపోకలు సాగించే ప్రాంతంలో మద్యం విక్రయం జరగడం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు.

బహిరంగ సేవనం – మహిళల అభద్రత

దుకాణం వద్దే మద్యం సేవించడం నిత్యకృత్యంగా మారిందని, ఇది ఎక్సైజ్ నిబంధనలకు వ్యతిరేకమని ఫిర్యాదులో పేర్కొన్నారు. మద్యం సేవించిన వ్యక్తులు అక్కడే గుమికూడడంతో మహిళలు, విద్యార్థినులు, భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ముఖ్యంగా సాయంత్రం వేళల్లో పరిస్థితి అధికంగా దిగజారుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని చెప్పారు.

ప్రభుత్వం నిర్ణయించిన గరిష్ట చిల్లర ధర (MRP) కంటే అధిక ధరలకు మద్యం విక్రయిస్తూ సామాన్యులను దోచుకుంటున్నారని ఆరోపించారు. ధరల పట్టికను స్పష్టంగా ప్రదర్శించకుండా వినియోగదారులను మభ్యపెడుతున్నారని విమర్శించారు. ఈ అంశంపై ఎక్సైజ్ శాఖ దృష్టి సారించి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

సమయ పాలన మృగ్యం

నిర్దేశించిన సమయాలను పాటించకుండా అర్థరాత్రి వరకు విక్రయాలు సాగుతున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. అధికారుల పర్యవేక్షణ లోపంతోనే ఈ పరిస్థితి నెలకొన్నదని అన్నారు. సమయపాలనపై కఠిన చర్యలు తీసుకుంటేనే ఇలాంటి అక్రమాలు తగ్గుతాయని అభిప్రాయపడ్డారు.

అధికారుల సర్వేకు డిమాండ్ 

 దుకాణం ఉన్న ప్రాంతాన్ని రెవెన్యూ, ఎక్సైజ్ అధికారులు అధికారికంగా కొలిపించాలని మధుబాబు కోరారు. 100 మీటర్ల పరిధిలో విద్యాసంస్థలు ఉన్నట్లు తేలితే లైసెన్స్‌ను రద్దు చేసి దుకాణాన్ని తక్షణమే తరలించాలని డిమాండ్ చేశారు. ప్రజా హితం, విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా అక్రమ మద్యం విక్రయాలపై ఉక్కుపాదం మోపాలని ఆయన అధికారులను విజ్ఞప్తి చేశారు.

ఈ అంశంపై అధికార యంత్రాంగం ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.