తాజా వార్తలు
True Times India
ఎడిటర్: SV || Anantapur Andhra Pradesh March 02, 2026

ఎస్పీ స్పందన భేష్.. సీఐ స్పందన ట్రాష్

|
ఈ-పేపర్ ప్రింట్ (PDF)

వరుస దొంగతనాలను ప్రశ్నించినందుకే విలేఖరిపై కక్షసాధింపా? ఉరవకొండ సీఐ తీరుపై సర్వత్రా విమర్శలు

ఉరవకొండ :“దేవుడు వరమిచ్చినా పూజారి వరమివ్వడు” అన్న సామెతలా ఉరవకొండ పోలీసు సర్కిల్‌ వ్యవహారం మారిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లా ఎస్పీ ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) ద్వారా బాధితులకు న్యాయం చేయాలని కృషి చేస్తుండగా, క్షేత్రస్థాయిలో కొందరు అధికారులు ఆ ఆశయానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ఉరవకొండకు చెందిన సీనియర్ విలేఖరి మాలపాటి శ్రీనివాసులు (65) తనపై జరిగిన మోసం కేసులో సరైన విచారణ జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మేకల సుబ్బు, కృష్ణవేణి అనే దంపతులు అవసరాల పేరుతో తనను నమ్మించి ‘ష్యూరిటీ’ సంతకం పెట్టించుకుని, అనంతరం బ్యాంకు రుణాన్ని చెల్లించకుండా మోసం చేశారని తెలిపారు. ఇది స్పష్టమైన క్రిమినల్ ‘చీటింగ్’ కేసు అయినప్పటికీ, ఉరవకొండ సీఐ మహానంది దీనిని సివిల్ వివాదంగా చూపిస్తూ కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. కేవలం ఫోన్ ద్వారా వివరాలు సేకరించి ఉన్నతాధికారులకు నివేదిక పంపడంపై కూడా ప్రశ్నలు లేవనెత్తారు.
ఇక ఇటీవల ఉరవకొండలో వరుస దొంగతనాలు చోటుచేసుకుంటున్నాయని, వాటిపై తాను వార్తలు రాసినందుకు కక్షసాధింపు చర్యలు ఎదుర్కొంటున్నాననే అనుమానం వ్యక్తం చేశారు. గత ఎస్ఐ వెంకటస్వామి ప్రేరణతో ప్రస్తుత సీఐ పీజీఆర్‌ఎస్ ఫిర్యాదులను ఏకపక్షంగా ముగిస్తున్నారని ఆయన ఆరోపించారు.
జిల్లా ఎస్పీ బాధితుల సమస్యలపై చొరవ చూపుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో ఆ చర్యలు అమలుకావడం లేదని శ్రీనివాసులు వాపోయారు. తన ఫిర్యాదుపై సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని, సంబంధిత అధికారుల పాత్రపై ఉన్నతాధికారులు దర్యాప్తు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.