నంద్యాల జిల్లా: జిల్లాలో ఉద్రిక్తతకు దారితీసే ఘటన చోటుచేసుకుంది. ఆళ్లగడ్డ శివారులోని పి.వి.ఎస్.ఆర్ గోడౌన్ వద్ద వైఎస్సార్‌సీపీ నేత శివరామిరెడ్డిపై దుండగులు కత్తులతో దాడి చేశారు.
సమాచారం ప్రకారం, ముగ్గురు వ్యక్తులు ముసుగులు ధరించి అక్కడికి చేరుకుని శివరామిరెడ్డిపై కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో ఆయన శరీరంపై తీవ్ర గాయాలు అయ్యాయి. ఘటన స్థలంలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి.
బాధితుడు శివరామిరెడ్డి మాట్లాడుతూ, తనపై భూమా అఖిలప్రియ అనుచరుడు నిఖిల్ దాడి చేశాడని ఆరోపించారు. “నన్ను చంపడానికే వచ్చారు. దాడి చేసిన వారిని గుర్తించాను” అని ఆయన తెలిపారు.
తీవ్రంగా గాయపడిన శివరామిరెడ్డిని వెంటనే నంద్యాల ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ కు తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు.
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. జిల్లా రాజకీయ వర్గాల్లో ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది.
