ఆర్.డి.టి సంస్థకు ఎఫ్‌సీఆర్‌ఏ పునరుద్ధరణ కోరుతూ ప్రధానికి పోస్ట్‌కార్డులు పంపే కార్యక్రమం
కుందుర్పి మండల కేంద్రంలో “సేవ్ ఆర్.డి.టి” ఉద్యమం భాగంగా లక్ష పోస్ట్‌కార్డులను దేశ ప్రధాని కార్యాలయానికి పంపే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మాజీ పార్లమెంట్ సభ్యులు తలారి రంగయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంట రామిరెడ్డి, ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రజా పరిషత్ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ పాల్గొన్నారు.
కుందుర్పి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన భారీ సభలో పెద్ద ఎత్తున ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని “సేవ్ ఆర్.డి.టి” నినాదాలతో ఉద్యమానికి మద్దతు తెలిపారు. అనంతరం మీడియాతో మాట్లాడిన జడ్పీ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ మాట్లాడుతూ, ఫాదర్ విన్సెంట్ ఆధ్వర్యంలో ఆర్.డి.టి సంస్థ అనంతపురం జిల్లాలో కరువు మరియు పేదరిక నిర్మూలన కోసం విశేషంగా పనిచేస్తోందని తెలిపారు.
గ్రామీణ ప్రాంతాల్లో క్రీడా ప్రతిభలను గుర్తించి వారికి జాతీయ స్థాయిలో ప్రాతినిధ్యం వహించే అవకాశాలు కల్పిస్తున్నదని ఆమె పేర్కొన్నారు. అంతేకాకుండా క్లిష్ట పరిస్థితుల్లో ప్రజలకు విద్య, ఆరోగ్యం, ఉపాధి వంటి రంగాల్లో ఈ సంస్థ ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టిందని తెలిపారు.
అయితే ఆర్.డి.టి సంస్థకు ఎఫ్‌సీఆర్‌ఏ (FCRA) పునరుద్ధరణ జరగకపోవడం వల్ల సంస్థ నిర్వహిస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు తీవ్ర ఆటంకం కలుగుతోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలు కూడా ప్రభావితమయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వం ఎఫ్‌సీఆర్‌ఏ నిబంధనలను సడలించి ఆర్.డి.టి సంస్థకు పునరుద్ధరణ కల్పించాలని, అలాగే అనంతపురం జిల్లా అభివృద్ధిని కాపాడే దిశగా రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి మరియు శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త సాకే శైలజానాథ్, శాసన మండలి సభ్యులు మంగమ్మ, ఉరవకొండ నియోజకవర్గ సమన్వయకర్త విశ్వేశ్వర రెడ్డి, నియోజకవర్గ పరిశీలకులు మహేంద్ర రెడ్డి, శ్రీ ఉమామహేశ్వర నాయుడు, తిప్పే స్వామి తదితర నాయకులు పాల్గొన్నారు.
అలాగే జడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు, ఇతర ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, మహిళలు మరియు పెద్ద ఎత్తున ప్రజలు హాజరై ఉద్యమానికి మద్దతు తెలిపారు.
