నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం నల్లవెల్లిలో దారుణం
నిజామాబాద్ : కుటుంబ కలహాలు, మత్తు పదార్థాల బానిసత్వం మరో కుటుంబాన్ని బలి తీసుకున్నాయి. నిజామాబాద్ జిల్లా లోని ఇందల్వాయి మండలం పరిధిలోని నల్లవెల్లి గ్రామం లో గురువారం రాత్రి జరిగిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.
గ్రామానికి చెందిన భాను ప్రకాశ్ (23) గంజాయికి బానిసై, డబ్బుల కోసం తరచూ ఇంట్లో గొడవలకు దిగేవాడని గ్రామస్తులు తెలిపారు. తండ్రి కిషన్‌ను నిత్యం వేధిస్తూ డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి చేసేవాడని సమాచారం. కుటుంబ సభ్యులు పలుమార్లు మందలించినా అతని ప్రవర్తనలో మార్పు రాలేదని చెబుతున్నారు.
బుధవారం రాత్రి కూడా ఇదే తరహాలో వాగ్వాదం చోటుచేసుకుంది. కొడుకు వేధింపులు హద్దులు మీరడంతో ఆగ్రహానికి లోనైన కిషన్, ఇంట్లో ఉన్న గొడ్డలితో దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. తీవ్ర గాయాలతో భాను ప్రకాశ్ అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం.
ఘటన అనంతరం కిషన్ స్వయంగా పోలీసులకు లొంగిపోయినట్లు తెలిసింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఈ ఘటనతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది. మత్తు పదార్థాల బానిసత్వం కుటుంబాలనే చీల్చేస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
