తాజా వార్తలు
True Times India
ఎడిటర్: SV || Andhra Pradesh Uravakonda March 05, 2026

ఉరవకొండ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఫోర్జరీ కలకలం..

|
ఈ-పేపర్ ప్రింట్ (PDF)

భూ రిజిస్ట్రేషన్లపై జిల్లా రిజిస్ట్రార్ విచారణకు ఆదేశం

ఉరవకొండ :
అనంతపురం జిల్లా ఉరవకొండ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జరిగిన భూ రిజిస్ట్రేషన్లలో ఫోర్జరీ జరిగినట్లు ఆరోపణలు రావడంతో జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం అప్రమత్తమైంది. గతంలో నమోదైన రెండు కీలక అమ్మకపు పత్రాలు మోసపూరితంగా రిజిస్టర్ అయ్యాయని ప్రాథమిక ఆధారాలు లభించడంతో ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ చేపట్టాలని అధికారులు నిర్ణయించారు.

పదేళ్ల నాటి పత్రాలపై ఫిర్యాదు

ఉరవకొండకు చెందిన ఎం. మధుబాబు (తండ్రి: ఎం. నాగేంద్ర) తన భూమికి సంబంధించిన 2264/2012 మరియు 2619/2016 నంబర్ల సేల్ డీడ్లు ఫోర్జరీ చేసి అక్రమంగా రిజిస్టర్ చేసినట్లు ఆరోపిస్తూ గత ఏడాది డిసెంబర్ 27న అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును పరిశీలించిన జిల్లా రిజిస్ట్రార్, రిజిస్ట్రేషన్ చట్టం–1908 నిబంధనల ప్రకారం విచారణ ప్రారంభించారు.

ఆరుగురికి నోటీసులు

ఈ రిజిస్ట్రేషన్లలో సంబంధం ఉన్నట్లు భావిస్తున్న ఆరుగురికి జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం నోటీసులు జారీ చేసింది. వీరిలో
గుర్రం నారాయణస్వామి (సొల్లపురం),
కొమ్మసాని బాలచంద్ర (ఉరవకొండ),
మంగళ విశ్వనాథ్ (పెద్దకౌకుంట్ల),
మీనుగ బసవరాజు (ఉరవకొండ),
రాయల భీమన్న (ఉరవకొండ) తదితరులు ఉన్నారు.
వీరంతా ఫిబ్రవరి 28, 2026న ఉదయం 11 గంటలకు అనంతపురంలోని జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని నోటీసులో పేర్కొన్నారు. వ్యక్తిగతంగా లేదా తమ న్యాయవాదుల ద్వారా హాజరై సంబంధిత పత్రాలు సమర్పించాలని ఆదేశించారు.

హాజరుకాకపోతే ఏకపక్ష నిర్ణయం

నోటీసులు అందుకున్న వారు నిర్ణీత సమయానికి విచారణకు హాజరుకాకపోతే ఫిర్యాదుదారు అందించిన రికార్డుల ఆధారంగానే ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని తదుపరి చర్యలు చేపడతామని జిల్లా రిజిస్ట్రార్ హెచ్చరించారు. ఈ వ్యవహారంపై నివేదికను రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డీఐజీకి కూడా పంపినట్లు సమాచారం.