నేషనల్ సెకండ్ ర్యాంక్ సాధించి అంతర్జాతీయ పోటీలకు అర్హత.
హైదరాబాద్: అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం గంజికుంట గ్రామానికి చెందిన విద్యార్థిని కె. సాయి ప్రహర్షిత జాతీయ స్థాయిలో ప్రతిభ చాటింది. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి పి.ఎన్.ఆర్ (PNR) స్కూల్‌లో ఆదివారం నిర్వహించిన జాతీయ స్థాయి అబాకస్ పోటీల్లో ఆమె ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకుంది.
గంజికుంటలోని శ్రీ సాహితీ విజ్ఞాన్ స్కూల్‌లో చదువుతున్న సాయి ప్రహర్షిత అబాకస్ లెవల్–2 విభాగంలో పాల్గొని నేషనల్ సెకండ్ ర్యాంక్ సాధించింది. ఈ విజయంతో ఆమె అంతర్జాతీయ అబాకస్ పోటీల్లో పాల్గొనే అర్హతను కూడా సంపాదించింది.
దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి అనేక మంది విద్యార్థులు పాల్గొన్న ఈ పోటీల్లో ఆంధ్రప్రదేశ్‌లోని మారుమూల గ్రామానికి చెందిన విద్యార్థిని జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరచడం విశేషంగా నిలిచింది. ప్రహర్షిత ప్రతిభను గుర్తించిన విశ్వం టెక్ సంస్థ ప్రతినిధులు ఆమెకు రూ.2,000 నగదు బహుమతితో పాటు రన్నరప్ ట్రోఫీని అందజేసి సత్కరించారు.
సాయి ప్రహర్షిత సాధించిన ఈ విజయంపై శ్రీ సాహితీ విజ్ఞాన్ స్కూల్ యాజమాన్యం హర్షం వ్యక్తం చేసింది. పాఠశాల కరస్పాండెంట్ వేణుగోపాల్, హెడ్ మాస్టర్ జాకీర్ హుస్సేన్, డైరెక్టర్ ప్రకాష్ విద్యార్థినిని అభినందించారు. ఆమెకు అబాకస్‌లో ప్రత్యేక శిక్షణ అందించిన ఉపాధ్యాయుడు రామాంజనేయులును కూడా వారు అభినందించారు.
మారుమూల గ్రామంలో ఉండి కూడా కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తూ విద్యార్థులను జాతీయ స్థాయికి తీసుకెళ్తున్న శ్రీ సాహితీ విజ్ఞాన్ స్కూల్ యాజమాన్యాన్ని గ్రామస్థులు, మండల ప్రజలు ప్రశంసించారు.
సాయి ప్రహర్షిత విజయాన్ని ఇతర విద్యార్థులు స్ఫూర్తిగా తీసుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని పలువురు ఆకాంక్షించారు. అంతర్జాతీయ స్థాయి పోటీల్లో కూడా ఆమె మరింత ప్రతిభ కనబరిచి జిల్లా, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఆశాభావం వ్యక్తం చేశారు.
