కెనడాలో భారత సంతతికి చెందిన ఓ మహిళా యూట్యూబర్ దారుణ హత్యకు గురైన ఘటన సంచలనం సృష్టించింది. పంజాబ్ మూలాలు కలిగిన నాన్సీ గ్రేవాల్ ఒంటారియో ప్రావిన్స్‌లోని లాసల్లే ప్రాంతంలో నివసిస్తూ సోషల్ మీడియాలో ఇన్‌ఫ్లుయెన్సర్‌గా గుర్తింపు పొందింది. పంజాబ్‌కు సంబంధించిన సామాజిక, రాజకీయ అంశాలపై తరచూ వీడియోలు విడుదల చేస్తూ చర్చల్లో నిలిచేది.
లాసల్లే పోలీసుల వివరాల ప్రకారం, మంగళవారం రాత్రి సుమారు 9 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తి నాన్సీ ఇంట్లోకి చొరబడి కత్తితో దాడి చేశాడు. విచక్షణా రహితంగా పలుమార్లు పొడిచి అక్కడి నుంచి పారిపోయినట్లు తెలుస్తోంది. రక్తపు మడుగులో పడి ఉన్న నాన్సీని స్థానికులు గమనించి వెంటనే పోలీసులకు, అత్యవసర వైద్యసిబ్బందికి సమాచారం అందించారు.
విండ్సర్-ఎసెక్స్ ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని ఆమెను ఆస్పత్రికి తరలించారు. అయితే వైద్యులు పరీక్షించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు ధ్రువీకరించారు.
బుధవారం ఉదయం పోలీసులు నాన్సీ నివాస ప్రాంతంలో రెండు ఇళ్లలో సోదాలు నిర్వహించారు. ఆమె ఇంటి బయట కాంక్రీట్ రహదారి, మెట్ల వద్ద నుండి పలు ఆధారాలను సేకరించారు. ఈ ఘటనకు గల కారణాలపై వివిధ కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది.
కేసుకు సంబంధించిన సమాచారం ఎవరైనా అందిస్తే వెంటనే డిటెక్టివ్ జామీ నెస్టర్‌ను సంప్రదించాలని పోలీసు ఉన్నతాధికారులు ప్రజలను కోరారు. ఈ ఘటన స్థానిక భారతీయ సమాజాన్ని తీవ్ర విషాదంలో ముంచెత్తింది.