అనంతపురం:ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రజల ఆశాజ్యోతి, బడుగు బలహీనవర్గాల పాలిట వరంగా నిలిచిన ఆర్డీటీ (రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ - RDT) సంస్థకు కేంద్ర ప్రభుత్వం ఎఫ్.సీ.ఆర్.ఏ (FCRA) లైసెన్స్‌ను రెన్యూవల్ చేసింది. ఈ శుభ సందర్భంగా ఆర్డీటీ సంస్థ ప్రోగ్రామ్ డైరెక్టర్ మాంచో ఫెర్రర్ మరియు వారి కుటుంబ సభ్యులను మడకశిర శాసనసభ్యులు, టీటీడీ పాలకమండలి సభ్యులు, శ్రీసత్యసాయి జిల్లా టీడీపీ అధ్యక్షులు ఎం.ఎస్.రాజు మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు.
కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎఫ్.సీ.ఆర్.ఏ రెన్యూవల్ విషయంలో ఆర్డీటీ అనేక ఇబ్బందులు ఎదుర్కొంది. అయితే, ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఆర్డీటీకి ఇచ్చిన మాటను నిలబెట్టుకుందని, ఈ సమస్య పరిష్కారానికి కృషి చేసిన ప్రభుత్వానికి, ఎమ్మెల్యే ఎం.ఎస్.రాజుకు మాంచో ఫెర్రర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎం.ఎస్.రాజు మాట్లాడుతూ.. పేదలకు నిస్వార్థంగా సేవలందిస్తున్న ఆర్డీటీకి పూర్వవైభవం రాబోతున్నందుకు సంతోషంగా ఉందన్నారు. తన వంతు సహాయ సహకారాలు అందించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు.
ఘనంగా కృతజ్ఞతా ర్యాలీ
లైసెన్స్ రెన్యూవల్ అయిన ఆనందంలో మడకశిరలో భారీ కృతజ్ఞతా ర్యాలీ నిర్వహించారు. అంతేకాకుండా, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమాల పట్ల మాంచో ఫెర్రర్ హర్షం వ్యక్తం చేయడంతో పాటు, ఎం.ఎస్.రాజును ప్రత్యేకంగా అభినందించారు.
కేంద్ర ప్రభుత్వ పెద్దలకు ధన్యవాదాలు
ఈ సమస్య పరిష్కారంలో చొరవ చూపిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు, ఇతర కేంద్ర మంత్రులకు ఆర్డీటీ యాజమాన్యం మరియు వారి కుటుంబ సభ్యులు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఉమ్మడి అనంతపురం అభివృద్ధిలో ఆర్డీటీ సేవలు నిర్విరామంగా కొనసాగాలని ఆకాంక్షిస్తూ, ఎమ్మెల్యే ఎం.ఎస్.రాజు.. మాంచో ఫెర్రర్ దంపతులను శాలువాతో ఘనంగా సత్కరించారు.