ఉరవకొండ : అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉరవకొండ పట్టణంలోని శ్రీ వీరశైవ కళ్యాణ మండపంలో ఆదివారం మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉరవకొండ నియోజకవర్గ ప్రత్యేక అధికారిణి, డిప్యూటీ కలెక్టర్ టి. పద్మావతి, ఐసీడీఎస్ సీడీపీఓ డాక్టర్ బి.ఎన్. శ్రీదేవి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుంచి మహిళా సర్పంచ్‌లు, జెడ్పీటీసీలు, గ్రామ సమైక్య సంఘాల లీడర్లు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అలాగే మండల రెవెన్యూ అధికారులు (ఎంఆర్వో), మండల ప్రజా పరిషత్ అధికారులు (ఎంపీడీవో), వెలుగు ప్రాజెక్ట్ అధికారులు, ఐసీడీఎస్ సిబ్బంది, అంగన్‌వాడీ కార్యకర్తలు మరియు సహాయకులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ఈ సందర్భంగా వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన మహిళలను శాలువాలతో ఘనంగా సత్కరించారు. రాజకీయ రంగంలో సేవలందించిన మాజీ ఎంపీపీ సుంకు రత్నమ్మ (ఆమిద్యాల), వజ్రకరూరు సర్పంచ్ మోనాలిసలను ప్రత్యేకంగా అభినందించారు. అలాగే మహిళా రైతులుగా కృషి చేస్తున్న గాయత్రి, ఎల్లమ్మ, రత్నలను కూడా సత్కరించారు. సేవా రంగంలో మహిళా వాహన మిత్రగా సేవలందిస్తున్న పుణ్యవతిని సన్మానించారు.
ఈ సందర్భంగా డిప్యూటీ కలెక్టర్ టి. పద్మావతి మాట్లాడుతూ మహిళలకు సమాజ గమనాన్ని మార్చగలిగే శక్తి ఉందని అన్నారు. నేటి సమాజంలో మహిళలు విద్య, వ్యవసాయం, వ్యాపారం, రాజకీయాలు వంటి అన్ని రంగాల్లోనూ ముందుకు వస్తున్నారని పేర్కొన్నారు. మహిళలు నాయకత్వ బాధ్యతలు చేపట్టడం సమాజ అభివృద్ధికి మంచి సూచిక అని అన్నారు.
ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో మహిళా సాధికారత కోసం కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు. మహిళలు తమ ప్రతిభను మరింతగా చాటుకుని సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో సాగింది. మహిళల సాధికారతకు ప్రాధాన్యతనిస్తూ నిర్వహించిన ఈ వేడుకలకు హాజరైన మహిళలు ఆనందం వ్యక్తం చేశారు.
