తాజా వార్తలు
True Times India
ఎడిటర్: SV || Andhra Pradesh Education March 10, 2026

ప్రైవేటుకు పోటీగా సర్కారు బడులు: అడ్మిషన్ల కోసం ఉపాధ్యాయుల ఇంటింటి ప్రచారం

|
ఈ-పేపర్ ప్రింట్ (PDF)

రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు క్రమంగా మారుతున్నాయి. కార్పొరేట్ విద్యాసంస్థలకు పోటీగా సర్కారు బడులు కూడా ముందుకు వస్తున్నాయి. వచ్చే 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లను పెంచడమే లక్ష్యంగా ఉపాధ్యాయులు ఇప్పటి నుంచే క్షేత్రస్థాయిలోకి వెళ్లి ప్రచారం ప్రారంభించారు.

సాధారణంగా ప్రైవేట్ పాఠశాలలు డిసెంబర్, జనవరి నుంచే అడ్మిషన్ల కోసం ప్రచారం ప్రారంభిస్తాయి. అదే విధంగా ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు కూడా ముందడుగు వేస్తున్నారు. గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి తల్లిదండ్రులను కలుస్తూ ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న సౌకర్యాలు, విద్యా ప్రమాణాలను వివరంగా తెలియజేస్తున్నారు.

కొన్ని చోట్ల ఉపాధ్యాయులు తమ సొంత ఖర్చులతో ఆటోలకు మైకులు ఏర్పాటు చేసి ప్రచారం నిర్వహిస్తున్నారు. కరపత్రాలు పంచుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదివితే లభించే ప్రయోజనాలను ప్రజలకు వివరించడం విశేషంగా కనిపిస్తోంది.

ప్రచారం సందర్భంగా ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలల్లో అందుతున్న వివిధ సదుపాయాలను ప్రజలకు తెలియజేస్తున్నారు. డిజిటల్ క్లాస్‌రూమ్‌లు, బైజూస్ కంటెంట్‌తో కూడిన ట్యాబ్‌లు, ఇంగ్లీష్ మీడియం బోధనతో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తున్నట్లు చెబుతున్నారు. అలాగే ‘డొక్కా సీతమ్మ’ మధ్యాహ్న భోజన పథకం ద్వారా ప్రతిరోజూ మెనూ మార్పుతో కూడిన పోషకాహారం, ఉడికించిన గుడ్డు, రాగి జావ, చిక్కీలు అందిస్తున్నట్లు వివరించారు.

ఇక విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్, మూడు జతల యూనిఫామ్‌లు, షూస్, సాక్స్, బ్యాగులు అందిస్తున్నట్లు ఉపాధ్యాయులు చెబుతున్నారు. విద్యార్థుల ఆరోగ్య సంరక్షణకు కూడా ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ రక్త పరీక్షలు నిర్వహించడం, ఐరన్ టాబ్లెట్ల పంపిణీ చేయడం, వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించడం జరుగుతోందని తెలిపారు.

ప్రభుత్వ పాఠశాలలపై ఉన్న అపోహలను తొలగించేందుకు ఉపాధ్యాయులు ఫలితాలను కూడా ప్రస్తావిస్తున్నారు. పదో తరగతి ఫలితాల్లో అనేక ప్రభుత్వ పాఠశాలలు 70 శాతం పైగా ఉత్తీర్ణత సాధిస్తున్నాయని, విద్యార్థులు ఐఐటీ వంటి ఉన్నత విద్యాసంస్థల్లో సీట్లు సాధిస్తున్నారని చెబుతున్నారు.

ప్రైవేట్ పాఠశాలల భారీ ఫీజుల భారం నుంచి తల్లిదండ్రులు బయటపడాలని, ప్రభుత్వ పాఠశాలల్లో కూడా నాణ్యమైన విద్య అందుబాటులో ఉందని ఉపాధ్యాయులు పిలుపునిస్తున్నారు. “మీ పిల్లల భవిష్యత్తు సర్కారు బడిలో కూడా భద్రమే” అని చెబుతూ అడ్మిషన్ల కోసం తల్లిదండ్రులను ఆహ్వానిస్తున్నారు.