ఉరవకొండ, మార్చి 18: విశాఖపట్నంలో జరిగిన భారత విద్యార్థి ఫెడరేషన్ (AISF) రాష్ట్ర సమితి సమావేశాల్లో కీలక నిర్ణయం తీసుకున్నారు. అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గానికి చెందిన యువ విద్యార్థి నాయకుడు తగ్గుపర్తి చందును రాష్ట్ర సమితి సభ్యునిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.మంగళవారం జరిగిన ఈ సమావేశాల్లో రాష్ట్ర నాయకత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకోవడం గమనార్హం. చందు ఎన్నిక పట్ల స్థానిక విద్యార్థి వర్గాలు, AISF కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తన ఎన్నికపై స్పందించిన చందు.. తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతను అప్పగించిన రాష్ట్ర నాయకత్వానికి, అనంతపురం జిల్లా ప్రధాన కార్యదర్శి కుళ్లాయి స్వామికి, జిల్లా కమిటీ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని స్పష్టం చేశారు.
రానున్న రోజుల్లో విద్యార్థుల పక్షాన పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని చందు పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విద్యా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా రాజీలేని పోరాటం చేస్తామని తెలిపారు. అలాగే ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో నెలకొన్న మౌలిక సదుపాయాల సమస్యలను పరిష్కరించే వరకు ఉద్యమాలు కొనసాగిస్తామని చెప్పారు.
ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థల ఫీజుల దోపిడీని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటామని, ఎన్నికల సమయంలో ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు దశలవారీగా పోరాటాలు నిర్వహిస్తామని చందు స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా ఉరవకొండ నియోజకవర్గానికి చెందిన విద్యార్థి నాయకులు, AISF కార్యకర్తలు చందుకు అభినందనలు తెలియజేశారు.