తాజా వార్తలు
True Times India
ఎడిటర్: SV || Andhra Pradesh Uravakonda March 16, 2026

న్యాయం చేయండి.. లేదంటే చావడానికి అనుమతివ్వండి!

|
ఈ-పేపర్ ప్రింట్ (PDF)

 -ఏడుగురు బిడ్డలతో వీధిన పడ్డ గిరిజన తల్లి దీనగాథ

-అత్తమామల వేధింపులు.. పోలీసుల నిర్లక్ష్యంపై బాధితురాలి కన్నీటి పర్యంతం

అనంతపురం/వజ్రకరూరు మార్చి 16:

"నా భర్త పోయాడు.. ఏడుగురు బిడ్డలు అనాథలయ్యారు.. ఉండటానికి ఇల్లు లేదు, తినడానికి తిండి లేదు. ఆస్తి అడిగితే అత్తమామలు కొట్టి తరిమేశారు. పోలీసుల చుట్టూ తిరిగినా న్యాయం జరగలేదు. అయ్యా.. మాకు బ్రతికే దారి చూపండి, లేదంటే ఈ పిల్లాపాపలతో కలిసి చనిపోవడానికి అనుమతి ఇవ్వండి" అంటూ ఒక గిరిజన మహిళ చేసిన ఆర్తనాదం కలెక్టర్ కార్యాలయం గోడలను సైతం కదిలించింది.

కన్నీటి గాథ వివరాల్లోకి వెళ్తే..

వజ్రకరూరు మండలం ఎన్.ఎన్.పి తండాకు చెందిన హరి నాయక్‌తో, రూపా నాయక్ తండాకు చెందిన పుష్ప బాయికి 2015లో వివాహమైంది. వివాహం జరిగిన నాటి నుంచే అత్తమామల వేధింపులు ఉన్నప్పటికీ, భర్త అండతో ఆమె కాలం వెళ్లదీసింది. వీరికి ఆరుగురు ఆడపిల్లలు, ఒక బాబు.. మొత్తం ఏడుగురు సంతానం. అయితే, 2025 డిసెంబర్‌లో భర్త హరి నాయక్ ఆకస్మికంగా మరణించడంతో పుష్ప బాయి జీవితం ఒక్కసారిగా చీకటిమయమైంది.

ఆస్తి కోసం అమానుషం

భర్త చనిపోయిన దుఃఖంలో ఉన్న పుష్ప బాయిని ఓదార్చాల్సింది పోయి, ఆమె అత్తమామలు అమానుషంగా ప్రవర్తించారు. ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని, పెళ్లి సమయంలో ఇచ్చిన నగదు, బంగారం, ఇల్లు తమదేనంటూ ఏడుగురు చిన్న బిడ్డలతో సహా ఆమెను ఇంటి నుంచి కనికరం లేకుండా గెంటివేశారు. పుట్టింటి వారు కూడా నిరుపేదలు కావడంతో, కన్న బిడ్డల ఆకలి కేకలు చూడలేక ఆమె మూడు నెలలుగా న్యాయం కోసం పోరాడుతోంది.

పోలీసుల నిర్లక్ష్యం - ఎస్పీ ఆగ్రహం

న్యాయం కోసం గతేడాది డిసెంబర్ నుంచి వజ్రకరూరు పోలీస్ స్టేషన్ చుట్టూ పుష్ప బాయి కాళ్లరిగేలా తిరుగుతోంది. కానీ, అక్కడి అధికారులు పొంతన లేని సమాధానాలు చెబుతూ ఆమెను ఏమాత్రం పట్టించుకోలేదని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. చివరికి గత్యంతరం లేక సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జరిగిన PGRS (ప్రజా గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టమ్) లో జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసింది. బాధితురాలి పరిస్థితిని చూసి చలించిన ఎస్పీ, వెంటనే వజ్రకరూరు ఎస్సైపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే విచారణ జరిపి పుష్ప బాయికి న్యాయం చేయాలని ఆదేశించారు.

మరణ వాంగ్మూలం లాంటి విన్నపం

"నాకు న్యాయం జరిగి, నా కుటుంబం సాఫీగా సాగడానికి ప్రభుత్వమే ఆదుకోవాలి. ఒకవేళ అది సాధ్యం కాకపోతే, ఈ నరకం అనుభవించలేక పిల్లాపాపలతో కలిసి చనిపోవడానికి కోర్టు ద్వారా అనుమతి ఇప్పించండి" అంటూ ఆమె చేసిన విన్నపం అందరినీ కలిచివేసింది.

ఏడుగురు బిడ్డల భవిష్యత్తు కోసం ఆ తల్లి చేస్తున్న పోరాటానికి ఇప్పటికైనా అధికారులు స్పందించి, ఆ గిరిజన కుటుంబానికి అండగా నిలవాలని స్థానికులు కోరుతున్నారు.