తాజా వార్తలు
True Times India
ఎడిటర్: SV || ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ March 13, 2026

సింగరాయకొండలో భూకబ్జా కలకలం: దళితురాలి ప్లాట్ ఆక్రమణ.. అడ్డుకుంటే కాళ్లు విరగ్గొడతామని బెదిరింపులు!

|
ఈ-పేపర్ ప్రింట్ (PDF)

 

సింగరాయకొండ: ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంలో ఒక దళిత మహిళా న్యాయవాదికి చెందిన స్థలాన్ని కొందరు వ్యక్తులు దౌర్జన్యంగా ఆక్రమించుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. తన తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన ఆస్తిని కాపాడుకోవాలని చూస్తున్న బాధితురాలిని చంపేస్తామని, కాళ్లు విరగ్గొడతామని ప్రత్యర్థులు బహిరంగంగా హెచ్చరిస్తుండటంతో స్థానికంగా భయాందోళనలు నెలకొన్నాయి.

అసలేం జరిగింది?

హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న అడ్వకేట్ మన్నం (కోమటిరెడ్డి) కోటేశ్వరి (@స్వాతి) తండ్రి మన్నం కోటేశ్వరరావుకు సోమరాజుపల్లి గ్రామంలో సర్వే నంబర్ 684/3లో 0.5 సెంట్ల (242 గజాల) ప్లాట్ ఉంది. 1982లో కొనుగోలు చేసిన ఈ స్థలానికి సంబంధించి అన్ని పత్రాలు సక్రమంగా ఉన్నప్పటికీ, పక్కనే నివసించే చొప్పర రామకోటయ్య మరియు అతని అనుచరులు ఆ స్థలంపై కన్నేశారు.



దౌర్జన్యకాండ - బెదిరింపులు: 
బాధితురాలు కోటేశ్వరి తన ప్లాట్‌లో ఇల్లు కట్టుకోవాలని భావించగా, రామకోటయ్య వర్గీయులు ఆమె బంధువులను బెదిరించారు. "సింగరాయకొండ ప్లాటు జోలికి ఎవరైనా వస్తే కాళ్లు రెండు విరగ్గొడతా" అంటూ తీవ్ర పదజాలంతో హెచ్చరికలు జారీ చేశారు.

 * ఆక్రమణ: ఫిబ్రవరి 24, 2026న రామకోటయ్య తన అనుచరులతో కలిసి జెసిబి (JCB) సాయంతో ప్లాట్‌ను క్లీన్ చేసి, బాధితురాలు ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డును తొలగించారు. అక్కడ తన పేరు, ఫోన్ నంబర్ రాసి ప్లాట్‌ను ఆక్రమించుకున్నట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు.

 * దాడి: గతేడాది డిసెంబర్‌లో సింగరాయకొండ కోర్టు ప్రాంగణంలోనే కోటేశ్వరిపై ప్రత్యర్థులు భౌతిక దాడికి పాల్పడినట్లు సమాచారం. ఈ విషయంపై అప్పట్లో పోలీసులు బైండోవర్ కేసులు నమోదు చేసినా, వారి ఆగడాలు తగ్గలేదని తెలుస్తోంది.

న్యాయం కోసం వేడుకోలు

తమకు ప్రాణహాని ఉందని, నిందితులపై క్రిమినల్ చర్యలు తీసుకుని తన తండ్రి స్థలాన్ని తనకు అప్పగించాలని కోటేశ్వరి మండల రెవెన్యూ అధికారి (MRO) మరియు పోలీసులకు విన్నవించారు. న్యాయవాద వృత్తిలో ఉన్న తనకే రక్షణ లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏమిటని ఆమె ప్రశ్నిస్తున్నారు.