తాజా వార్తలు
True Times India
ఎడిటర్: SV || International iran March 04, 2026

చర్చలకు మేం సిద్ధం: ఇరాన్ ప్రకటన

|
ఈ-పేపర్ ప్రింట్ (PDF)

అమెరికా, ఇజ్రాయెల్‌లతో గౌరవప్రదమైన చర్చలకు తాము సిద్ధమని ఇరాన్ ప్రకటించింది. ముందుగా దాడులను పూర్తిగా నిలిపివేసి, బలవంతపు షరతులు లేకుండా చర్చలు ప్రారంభించాలని కోరింది. ఈ విషయాన్ని ఇరాన్ సుప్రీంలీడర్ ప్రత్యేక ప్రతినిధి అబ్దుల్ మజీద్ హకీమ్ ఇలాహి వెల్లడించారు.

ఇలాహి మాట్లాడుతూ, “మేం యుద్ధాన్ని నిలిపేయడానికి సిద్ధంగా ఉన్నాం. చర్చలకు కూడా సిద్ధమే. అయితే ఇరాన్‌పై బలవంతపు షరతులు విధించకుండా, పరస్పర గౌరవంతో చర్చలు జరగాలి. మేం మా హక్కుల కోసం మాత్రమే పోరాడుతున్నాం” అని స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఇరాన్‌పై దాడులు చేయబోమని హామీ ఇవ్వాలని, తమపై విధించిన ఆర్థిక ఆంక్షలను ఎత్తివేయాలని విజ్ఞప్తి చేశారు.

ఒకవైపు దాడులు కొనసాగిస్తూ మరోవైపు చర్చలకు ఆహ్వానించడం సాధ్యం కాదని ఇలాహి వ్యాఖ్యానించారు. ముందుగా యుద్ధ చర్యలు నిలిచిపోతేనే చర్చలకు అనుకూల వాతావరణం ఏర్పడుతుందని పేర్కొన్నారు. ఈ యుద్ధాన్ని ఇరాన్ ప్రారంభించలేదని, అమెరికానే మొదలుపెట్టిందని ఆరోపించారు. కాబట్టి మొదటగా కాల్పుల విరమణ ప్రకటించాల్సింది అమెరికానేనని అన్నారు.

దాడులకు ముందు ఒమన్ మధ్యవర్తిత్వంతో జరిగిన చర్చలు దాదాపు ఒప్పంద స్థాయికి చేరుకున్నాయని గుర్తుచేశారు. ఈ అంశంపై ఒమన్ విదేశాంగ మంత్రి కూడా ఆశాభావం వ్యక్తం చేశారని తెలిపారు. అయితే ఆ దశలోనే అమెరికా, ఇజ్రాయెల్‌లు ఏకపక్షంగా దాడులకు దిగాయని విమర్శించారు.

ఇరాన్ అధికార వర్గాల ప్రకటనలతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతల మధ్య చర్చల దిశగా పరిణామాలు మలుపుతిరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ సమాజం కూడా యుద్ధ విరమణకు పిలుపునిస్తోంది. ఈ నేపథ్యంలో ఇరాన్ వైఖరి కీలకంగా మారింది.

అయతుల్లా ఖమేనీ అంత్యక్రియలను పవిత్ర నగరంగా భావించే మషాద్లో నిర్వహించాలని ఇరాన్ అధికారులు నిర్ణయించారు. ఖమేనీ జన్మస్థలం కూడా మషాద్ కావడం విశేషం. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఆయన మృతి చెందినట్లు ఇరాన్ వర్గాలు ప్రకటించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

అయితే అంత్యక్రియల తేదీని ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. భద్రతా కారణాల దృష్ట్యా తేదీని గోప్యంగా ఉంచినట్లు తెలుస్తోంది. మషాద్‌లో భారీగా భద్రతా ఏర్పాట్లు చేపడుతున్నట్లు ఇరాన్ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.