తాజా వార్తలు
True Times India
ఎడిటర్: SV || ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ March 16, 2026

ఉరవకొండలో అక్రమ ట్యూషన్ల దందా.. నిబంధనలు గాలికి!

|
ఈ-పేపర్ ప్రింట్ (PDF)


 

ప్రభుత్వ ఉపాధ్యాయులు, ప్రైవేట్ ట్యూటర్లపై చర్యలు తీసుకోవాలని MROకు AIFDS వినతి

ఉరవకొండ మార్చి 16:

పట్టణంలో ట్యూషన్ల పేరుతో సాగుతున్న భారీ దోపిడీపై ఏఐఎఫ్డీఎస్ (AIFDS) విద్యార్థి సంఘం గళమెత్తింది. నవోదయ, సైనిక్ స్కూల్, గురుకుల ప్రవేశాల పేరుతో తల్లిదండ్రులను బురిడీ కొట్టిస్తూ వేల రూపాయలు వసూలు చేస్తున్న ట్యూషన్ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ స్థానిక తహశీల్దార్ (MRO)కు వినతిపత్రం సమర్పించారు.

చట్టాలను తుంగలో తొక్కి.. అడ్డగోలు బోధన:

ఏఐఎఫ్డీఎస్ రాష్ట్ర అధ్యక్షులు సీఎం సిద్దు, జిల్లా అధ్యక్షులు నందు మాట్లాడుతూ.. పట్టణంలో సువిద్య రోబోటిక్స్, దానిషిక, ప్రతిభ, స్పందన వంటి ట్యూషన్ సెంటర్లు విద్యా చట్టాలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నాయని మండిపడ్డారు.

 * రిజిస్ట్రేషన్ లేదు: ఏపీ విద్యా చట్టం 1982 సెక్షన్ 32 ప్రకారం ట్యూషన్ నిర్వాహకులు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ పొందాలి. కానీ ఇక్కడ ఏ ఒక్క నిబంధనను పాటించడం లేదు.

 * అనర్హులతో బోధన: సెక్షన్ 23 ప్రకారం కేవలం బి.ఈ.డి, టిటిసి లేదా డి.ఈ.డి పూర్తి చేసిన వారే బోధించాలి. అయితే, ప్రతిభ స్టడీ సర్కిల్ వంటి చోట్ల కనీస అర్హత లేని వ్యక్తులతో 8, 9, 10 తరగతులకు బోధన సాగిస్తున్నారని వారు ఆరోపించారు.

ప్రభుత్వ ఉపాధ్యాయుల హస్తం!

కొంతమంది ప్రభుత్వ ఉపాధ్యాయులు కూడా నిబంధనలకు విరుద్ధంగా ట్యూషన్ సెంటర్లు నడుపుతూ లాభార్జనే ధ్యేయంగా పనిచేస్తున్నారని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులను ఆకర్షించి, రికార్డులను తారుమారు చేస్తూ.. ట్యూషన్ ముసుగులో రెగ్యులర్ తరగతులు నిర్వహిస్తున్నారని వెల్లడించారు.

అధికారుల వైఫల్యంపై ఆగ్రహం:

నిబంధనలు అతిక్రమిస్తే సెక్షన్ 19 ప్రకారం మొదటిసారి ₹10,000, రెండోసారి ₹1,00,000 జరిమానా విధించే అవకాశం ఉన్నా.. విద్యాశాఖ అధికారులు ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నించారు. మోసపోతున్న తల్లిదండ్రులను కాపాడాలని, అక్రమంగా నిర్వహిస్తున్న ట్యూషన్లపై ఉక్కుపాదం మోపి, బాధ్యులపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

లేనిపక్షంలో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు.