తాజా వార్తలు
True Times India
ఎడిటర్: SV || Anantapur Andhra Pradesh Uravakonda March 13, 2026

అక్రమ వాహనాల జోరు.. క్యాబ్స్క కార్మికులక న్నీరు!

|
ఈ-పేపర్ ప్రింట్ (PDF)

 * నిబంధనలకు విరుద్ధంగా 64 సి.ఎన్.జి వాహనాల రాకపోకలు

 * ఆర్.టి.సి ఆదాయానికి గండి.. స్థానిక వాహనదారుల ఉపాధి దెబ్బ

 * ఉరవకొండ సి.ఐ కి ఫిర్యాదు చేసిన 'లైట్ మోటార్ వెహికల్స్ అసోసియేషన్'

ఉరవకొండ, మార్చి 13: ఉరవకొండ పట్టణం మరియు నియోజకవర్గ పరిధిలో అక్రమ వాహనాల సంచారం మితిమీరిపోతోందని, దీనివల్ల నిబంధనల ప్రకారం ట్యాక్సులు కడుతున్న తాము తీవ్రంగా నష్టపోతున్నామని స్థానిక వాహనదారులు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం ఉరవకొండ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (సి.ఐ) గారిని కలిసిన శ్రీ షిరిడి సాయి లైట్ మోటార్ వెహికల్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఈ మేరకు వినతి పత్రం సమర్పించారు.

భారీగా పన్నులు కడుతున్నా ఫలితం లేదు:

ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ.. తాము ప్రభుత్వానికి త్రైమాసిక పన్నుగా రూ. 8,710, గ్రీన్ టాక్స్ రూ. 5,000 తో పాటు ఇన్సూరెన్స్, ఫిట్‌నెస్ సర్టిఫికెట్ల కోసం ఏటా లక్ష రూపాయల వరకు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. ఇంత భారీ మొత్తంలో ప్రభుత్వానికి ఆదాయం సమకూరుస్తున్నా, అధికారుల పర్యవేక్షణ లోపం వల్ల అక్రమ వాహనదారులు రెచ్చిపోతున్నారని మండిపడ్డారు.

అక్రమ సి.ఎన్.జి వాహనాల దందా:

ఉరవకొండ నుండి అనంతపురము మరియు చుట్టుపక్కల ప్రాంతాలకు కేవలం 18 వాహనాలకే గతంలో అనుమతి ఉన్నట్లు అధికారులు తెలిపారని, కానీ ప్రస్తుతం సుమారు 64 సి.ఎన్.జి వాహనాలు యథేచ్ఛగా ప్రయాణికులను తరలిస్తున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఒక్కో ప్రయాణికుడి నుండి రూ. 100 వసూలు చేస్తూ ఆర్.టి.సి ఆదాయానికి గండి కొట్టడమే కాకుండా, స్థానికంగా ఉన్న వాహనదారుల ఉపాధిని దెబ్బతీస్తున్నారని ఆరోపించారు.

ట్రాఫిక్ సమస్యలు - తక్షణ చర్యలకు డిమాండ్:

అనుమతి లేని వాహనాల వల్ల పట్టణంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయని, ప్రయాణికుల భద్రతకు కూడా ముప్పు వాటిల్లుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి అక్రమంగా తిరుగుతున్న 64 వాహనాలపై కఠిన చర్యలు తీసుకోవాలని, నిబంధనలు పాటించే వాహనదారులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు బి. కృష్ణ, వీరేష్, చైతన్య, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.