తాజా వార్తలు
True Times India
ఎడిటర్: SV || Andhra Pradesh Kadiri March 16, 2026

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హామీలను తక్షణమే అమలు చేయాలి: RCPI డిమాండ్

|
ఈ-పేపర్ ప్రింట్ (PDF)

కదిరిలో ఘనంగా ఆర్‌.సి.పి.ఐ (RCPI) రాష్ట్ర సదస్సు

కదిరి (శ్రీ సత్యసాయి జిల్లా): కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను విస్మరించి, ప్రజలను వంచిస్తున్నాయని రివల్యూషనరీ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (RCPI) ధ్వజమెత్తింది. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలోని ఎన్జీవో (NGO) హోమ్‌లో నిర్వహించిన రాష్ట్ర సదస్సులో నాయకులు శివకోటి రాజు మరియు నాగన్న పాల్గొని ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై నిప్పులు చెరిగారు.
ఉపాధి హామీ పథకంపై కుట్రలు:
కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తోందని నాయకులు విమర్శించారు. ఏటా నిధులు తగ్గిస్తూ, పథకం పేరును 'జి రాంజీ' పథకంగా మార్చడాన్ని వారు తీవ్రంగా ఆక్షేపించారు. తక్షణమే పాత పేరునే కొనసాగించాలని డిమాండ్ చేశారు.
ధరల పెరుగుదల - నిరుద్యోగ భృతి:
గ్యాస్ మరియు నిత్యవసర ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయని, దీనివల్ల ప్రైవేట్ హాస్టళ్లు మూతపడే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే, ఏటా కోటి 20 లక్షల ఉద్యోగాల హామీ ఏమైందని ప్రశ్నించారు. తక్షణమే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని, డిగ్రీ పూర్తి చేసిన నిరుద్యోగులకు నెలకు రూ. 3,000 నిరుద్యోగ భృతి చెల్లించాలని డిమాండ్ చేశారు.
మహిళా సంక్షేమం మరియు ఇళ్ల పట్టాలు:
రాష్ట్ర ప్రభుత్వం 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు ఇస్తానన్న రూ. 1,500 పథకాన్ని వెంటనే అమలు చేయాలన్నారు. అలాగే నిరుపేదల సొంతింటి కలను సాకారం చేస్తూ గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇళ్ల పట్టాలు కేటాయించాలని కోరారు.
అంతర్జాతీయ పరిణామాలు - శాంతి కోరిక:
ఇరాన్‌పై ఇజ్రాయిల్, అమెరికా జరుపుతున్న యుద్ధం కారణంగా క్రూడాయిల్, గ్యాస్ ధరలు పెరుగుతున్నాయని నాయకులు పేర్కొన్నారు. గతంలో పాకిస్థాన్‌పై 'ఆపరేషన్ సింధూర్' సమయంలో ట్రంప్ మాట విని యుద్ధం ఆపిన నరేంద్ర మోదీ గారు, ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు చెప్పి ఇరాన్ యుద్ధాన్ని ఎందుకు ఆపించలేకపోతున్నారని ప్రశ్నించారు. రష్యా, చైనాలతో కలిసి భారత్ ప్రపంచ శాంతి కోసం చొరవ చూపాలని వారు కోరారు.
ఉద్యమ హెచ్చరిక:
ప్రభుత్వాలు ఇప్పటికైనా స్పందించి హామీలను అమలు చేయాలని, లేనిపక్షంలో వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలను కలుపుకొని రాష్ట్రవ్యాప్తంగా భారీ ఎత్తున ఉద్యమిస్తామని RCPI హెచ్చరించింది.