న్యూఢిల్లీ, మార్చి 18: అనంతపురం జిల్లాలో విశేష సేవలు అందిస్తున్న ఆర్‌డీటీ సంస్థ ఎదుర్కొంటున్న పరిపాలనాపరమైన అడ్డంకులను తొలగించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చురుకుగా చర్యలు చేపట్టింది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రతినిధుల బృందం న్యూఢిల్లీలో కేంద్ర మంత్రితో కీలకంగా భేటీ అయింది.రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, రాజ్యసభ సభ్యుడు సనా సతీష్ బాబు కలిసి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్ మోహన్ నాయుడును మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆర్‌డీటీ నిర్వహిస్తున్న పలు సంక్షేమ కార్యక్రమాలు కేంద్ర అనుమతులు, సాంకేతిక కారణాల వల్ల ఆటంకాలు ఎదుర్కొంటున్నాయని రాష్ట్ర ప్రతినిధులు వివరించారు. ఈ సమస్యలు తక్షణమే పరిష్కరించకపోతే రాయలసీమలో వెనుకబడిన వర్గాలకు అందుతున్న సేవలు ప్రభావితమయ్యే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. రాయలసీమ ప్రాంతంలో విద్య, ఆరోగ్యం, గ్రామీణాభివృద్ధి రంగాల్లో ఆర్‌డీటీ అందిస్తున్న సేవలు వేలాది కుటుంబాలకు కీలకమని మంత్రి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. ఈ సేవలు అంతరాయం లేకుండా కొనసాగేందుకు కేంద్రం వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
దీనికి స్పందించిన కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడు సమస్య తీవ్రతను గుర్తించి, సంబంధిత శాఖలతో చర్చించి అడ్డంకులను తొలగించే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ట్రస్ట్ కార్యకలాపాలకు ఎటువంటి అంతరాయం కలగకుండా కేంద్రం పూర్తి సహకారం అందిస్తుందని ఆయన స్పష్టం చేశారు.
ప్రభుత్వ స్థాయిలో ప్రారంభమైన ఈ చొరవతో ఆర్‌డీటీకి ఎదురవుతున్న సమస్యలు త్వరలోనే పరిష్కారమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.