తాజా వార్తలు
True Times India
ఎడిటర్: SV || Andhra Pradesh Uravakonda March 13, 2026

అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలి: గుంతకల్లు RTOకు ఫిర్యాదు

|
ఈ-పేపర్ ప్రింట్ (PDF)

 * 40 ఏళ్ల చరిత్ర ఉన్న అసోసియేషన్‌కు తప్పని తిప్పలు

 * 64 ఎర్టిగా వాహనాలతో అక్రమ దందా.. పట్టించుకోని అధికారులు

  150 కుటుంబాల ఉపాధి దెబ్బతింటుందని ఆవేదన

ఉరవకొండ, మార్చి 13: నిబంధనలకు విరుద్ధంగా ఉరవకొండలో సాగుతున్న అక్రమ వాహన రవాణాను అరికట్టాలని కోరుతూ శ్రీ షిరిడి సాయి లైట్ ట్రాన్స్‌పోర్ట్ డ్రైవర్స్ అండ్ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు గుంతకల్లు ఆర్‌టీఓ (RTO) అధికారికి వినతి పత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత నాలుగు దశాబ్దాలుగా ఉరవకొండ పట్టణంలో వందలాది కుటుంబాలు ఈ రవాణా రంగంపై ఆధారపడి జీవిస్తున్నాయని తెలిపారు. అయితే, గత రెండేళ్లుగా కొంతమంది నిబంధనలకు విరుద్ధంగా 64 ఎర్టిగా (Ertiga) సి.ఎన్.జి వాహనాలను నడుపుతూ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు. స్థానిక ఆర్టీసీ డిపో ముందే ప్రయాణికులను ఎక్కించుకుంటూ, ఒక్కొక్కరి నుండి రూ. 100 వసూలు చేస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారని మండిపడ్డారు.

రోడ్డున పడుతున్న 150 కుటుంబాలు

అనుమతి లేని ఈ వాహనాల వల్ల నిబద్ధతతో పన్నులు చెల్లిస్తున్న 150 మంది డ్రైవర్లు, ఓనర్ల కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. వాహనాలకు కట్టవలసిన ఇన్సూరెన్స్, రోడ్డు ట్యాక్సులు కూడా కట్టలేనంతగా ఆదాయం పడిపోయిందని వాపోయారు. ఇప్పటికైనా ఆర్‌టీఓ అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టి, అక్రమ వాహనాలపై కఠిన చర్యలు తీసుకోవాలని, తమ కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు భాస్కర్, బి. కృష్ణ, మనోజ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.