పెన్నహోబిలం శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి ₹28.66 లక్షల హుండీ ఆదాయం

ఉరవకొండ మండలం: మండల పరిధిలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెన్నహోబిలం శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయ హుండీలను సోమవారం అధికారులు, ఆలయ కమిటీ సభ్యుల సమక్షంలో లెక్కించారు. గత 110 రోజుల వ్యవధిలో భక్తులు సమర్పించిన మొక్కుబడుల ద్వారా మొత్తం ₹28,66,338 ఆదాయం వచ్చినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి సాకే రమేష్ బాబు తెలిపారు.
జిల్లా దేవాదాయ శాఖ అధికారి గంజి మల్లికార్జున ప్రసాద్ పర్యవేక్షణలో హుండీ లెక్కింపు ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ రేగాటి నాగరాజు, సభ్యులు బొల్లినేని పద్మాక్షి, మీనుగ రామకృష్ణ, ధనుంజయ ఆచారి, అమల్లదిన్నె చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.
హుండీ లెక్కింపులో గుంతకల్లు హనుమాన్ సేవా సంస్థ, అనంతపురం 1వ రోడ్డు శివాలయం సేవా సమితి, భవాని సేవా సమితి సభ్యులు సేవలందించారు. అలాగే టి.డి.పి నాయకులు మోపిడి గోవిందు, ఇంద్రావతి సుధాకర్, కురుబ ఎర్రిస్వామి హాజరయ్యారు. ఉరవకొండ పోలీస్ స్టేషన్ సిబ్బంది, కెనరా బ్యాంక్ ఉరవకొండ శాఖ సిబ్బంది కూడా పాల్గొన్నారు.
సాధారణ హుండీతో పాటు అన్నదానం హుండీ ద్వారా వచ్చిన ఆదాయాన్ని కూడా లెక్కించి, నిబంధనల ప్రకారం బ్యాంకులో జమ చేసినట్లు ఈఓ రమేష్ బాబు వెల్లడించారు.

WhatsApp Facebook
హోమ్ ఏపీ తెలంగాణ జాతీయ