రహస్యంగా కమిటీ? కేవీ రమణపై ఉరవకొండలో ఆగ్రహ జ్వాలలు.
‘స్వార్థ రాజకీయాలు ఇక వద్దు’ – కేవీ రమణపై బెస్తల ఆగ్రహం
ఉరవకొండ : అనంతపురం జిల్లా బెస్త సేవా సంఘం అధ్యక్షుడు కేవీ రమణ పనితీరుపై ఉరవకొండ నియోజకవర్గ బెస్త కులస్తులలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఆయన నాయకత్వాన్ని తాము అంగీకరించబోమని స్పష్టం చేస్తూ శనివారం కులస్తులు ఒక ప్రకటన విడుదల చేశారు.
ప్రకటనలో, కేవీ రమణ తన పదవీ కాలం ముగిసినప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. జిల్లా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో బెస్త కులస్తుల సంక్షేమం, నిరుద్యోగ యువత సమస్యలను పట్టించుకోలేదని, వ్యక్తిగత ప్రయోజనాల కోసమే పనిచేశారని విమర్శించారు.
అలాగే, ఉరవకొండ నియోజకవర్గంలో కొత్త కమిటీని ఏర్పాటు చేసే ప్రక్రియలో పారదర్శకత పాటించలేదని కులస్తులు ఆరోపించారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా, తనకు అనుకూలంగా ఉన్న వ్యక్తులకు మాత్రమే సమాచారం అందించి గవి మఠంలో రహస్యంగా సమావేశం నిర్వహించారని పేర్కొన్నారు. ఆ సమావేశంలో ఎన్నుకున్న నూతన కమిటీ చెల్లదని తేల్చిచెప్పారు.
“పదవీ కాలం ముగిసిన వ్యక్తి కమిటీని ఎలా ఏర్పాటు చేస్తాడు?” అని ప్రశ్నించిన వారు, ఈ నూతన కమిటీని పూర్తిగా తిరస్కరిస్తున్నామని తెలిపారు.
కులస్తులు తమ డిమాండ్లలో భాగంగా, కేవీ రమణను జిల్లా అధ్యక్ష పదవి నుండి వెంటనే తొలగించాలని కోరారు. అలాగే, ఆయన ఏర్పాటు చేసిన ఉరవకొండ నియోజకవర్గ కమిటీని రద్దు చేసి, పారదర్శకంగా కొత్త కమిటీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ డిమాండ్లను పట్టించుకోకపోతే తమ నిరసన కార్యక్రమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ వ్యవహారం ప్రస్తుతం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.