అయోధ్య: ప్లస్ టూ పరీక్షలు రాసేందుకు వచ్చిన ఓ యువతి, ప్రియుడితో కలిసి పట్టపగలే బంగారు నగల దుకాణంలో చోరీకి పాల్పడిన ఘటన సంచలనం రేపింది. ఈ ఘటనలో ఇద్దరినీ పోలీసులు అరెస్ట్ చేశారు.
పోలీసుల వివరాల ప్రకారం, పాయల్ అనే యువతి ప్లస్ టూ పరీక్షల కోసం అయోధ్యకు వచ్చింది. పరీక్ష ముగిసిన తర్వాత తన ప్రియుడు రాహుల్‌తో కలిసి బురఖా ధరించి బైక్‌పై ఓ జ్యువెలరీ షాప్‌కు చేరుకుంది.
దుకాణంలోకి వెళ్లిన ఆమె, అక్కడ ఉన్న బంగారు నగలను అపహరించేందుకు ప్రయత్నించింది. ఇదే సమయంలో ఆమెతో వచ్చిన రాహుల్ పిస్టల్ చూపించి బెదిరించగా, ఇద్దరూ అక్కడి నుంచి బైక్‌పై పారిపోయారు.
అయితే ఘటనపై అప్రమత్తమైన పోలీసులు సీసీటీవీ ఆధారంగా దర్యాప్తు చేపట్టి, కొద్ది సేపటికే ఇద్దరినీ పట్టుకున్నారు. చోరీకి సంబంధించిన నగలను కూడా స్వాధీనం చేసుకున్నారు.
ప్రాథమిక విచారణలో, యువతి ఇప్పటికే వివాహితగా ఉండి భర్తతో పంజాబ్‌లో నివసిస్తున్నట్లు తెలిసింది. పరీక్షల నిమిత్తం స్వగ్రామానికి వచ్చి, ప్రియుడితో కలిసి ఈ చోరీకి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు.
ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
