గుంతకల్లు: దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న గుంతకల్లు–ఉరవకొండ–తుమకూరు రైల్వే లైన్ నిర్మాణ పనులను తక్షణమే ప్రారంభించాలని గిరిజన ఐక్య సాధన సమితి డిమాండ్ చేసింది. ఈ ప్రాజెక్టు వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి జీవనరేఖలా పనిచేస్తుందని సమితి నేతలు స్పష్టం చేశారు.
ఈ మేరకు సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు మూడ్ కేశవ నాయక్ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కు వినతి పత్రం సమర్పించారు.
వందేళ్ల నాటి కల.. ఇప్పటికీ నెరవేరని ఆశ బ్రిటిష్ కాలంలోనే, 1933లోనే ఈ రైల్వే లైన్ ప్రతిపాదనలు వచ్చాయని గిరిజన ఐక్య సాధన సమితి గుర్తు చేసింది. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న ఈ ప్రాజెక్టును వెంటనే ప్రారంభించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.
ప్రతిపాదిత మార్గం ప్రకారం గుంతకల్లు నుండి ఉరవకొండ మీదుగా కర్ణాటకలోని తుమకూరును కలుపుతూ కళ్యాణదుర్గం, మడకశిర, మధుగిరి, కొరటగిరి, పావగడ వంటి ప్రాంతాల గుండా బ్రాడ్‌గేజ్ రైల్వే లైన్ నిర్మాణం జరగాల్సి ఉంది.
వెనుకబడిన ప్రాంతాలకు అభివృద్ధి దారి
ఈ రైల్వే లైన్ అందుబాటులోకి వస్తే అనంతపురం జిల్లాతో పాటు సరిహద్దు ప్రాంతాల వేలాది గ్రామాలకు పెద్ద ఎత్తున లబ్ధి చేకూరుతుందని నేతలు పేర్కొన్నారు. ముఖ్యంగా—- ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లే గిరిజనులు, పేదలకు స్థానికంగా అవకాశాలు
- రైతులు, విద్యార్థులు, వ్యాపారులకు మెరుగైన రవాణా సౌకర్యం
- ప్రాంతీయ పారిశ్రామిక అభివృద్ధికి కొత్త మార్గం
- వలసల నివారణకే ఈ ప్రాజెక్టు కీలకమని వారు అభిప్రాయపడ్డారు.
గత ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లినా నిర్లక్ష్యం
ఈ అంశాన్ని 2001 మరియు 2018లో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లినప్పటికీ పనుల్లో పురోగతి లేదని నేతలు ఆవేదన వ్యక్తం చేశారు.ప్రాజెక్టు సాధన కోసం ఉరవకొండ నుండి గుంతకల్లు వరకు సుమారు 38 కిలోమీటర్ల పాదయాత్ర కూడా నిర్వహించినట్లు వారు తెలిపారు.