ఉరవకొండ: పట్టణంలో బీజేపీ జెండా కట్ట కూల్చివేత వ్యవహారం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఒకవైపు కూల్చివేతలు, మరోవైపు అనుమతుల కోసం మంత్రులను ఆశ్రయించడం స్థానిక రాజకీయాల్లో ఉత్కంఠను పెంచుతోంది.
ఇటీవల రెండు ప్రాంతాల్లో బీజేపీ నాయకులు జెండా కట్టలను ఏర్పాటు చేశారు. అయితే, అధికారులు అవి అనుమతి లేకుండా నిర్మించారని పేర్కొంటూ వేగంగా కూల్చివేయడం వివాదానికి దారితీసింది. ఈ చర్యల వెనుక రాజకీయ కోణం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
పార్టీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, ఈ ఘటన వెనుక అంతర్గత ఆధిపత్య పోరు కారణమై ఉండొచ్చని చర్చ జరుగుతోంది. ఇటీవల పార్టీలో చేరిన ఒక మహిళా మోర్చా నాయకురాలి వేగవంతమైన ఎదుగుదల కొందరు పాత నాయకులకు నచ్చకపోవడంతో, ఆమె ప్రభావాన్ని తగ్గించే ప్రయత్నంగా ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయని ప్రచారం జరుగుతోంది.
ఈ పరిణామాల నేపథ్యంలో బీజేపీ నాయకులు రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ను కలిసి వినతిపత్రం సమర్పించారు. “మా ఊరు - మా జెండా” కార్యక్రమంలో భాగంగా అధికారికంగా స్థలం కేటాయించాలని కోరారు.
వారి వినతిపై మంత్రి సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. నిబంధనల ప్రకారం జెండా కట్ట నిర్మాణానికి తగిన స్థలాన్ని పరిశీలించి చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించినట్లు తెలిసింది.
ఈ బృందంలో మాదినేని లక్ష్మీనారాయణ, ధనంజయ ఆచారి, హరి, బెస్త రామాంజనేయులు, బాలు తదితర నాయకులు పాల్గొన్నారు.
ఈ ఘటనపై బీజేపీ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న పార్టీకి చెందిన జెండా కట్టలను కూల్చివేయడం అన్యాయమని అభిప్రాయపడుతున్నారు. స్వపక్షంలోని కొందరు నాయకుల రాజకీయాల వల్లే పార్టీ ప్రతిష్ట దెబ్బతింటోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మంత్రి జోక్యంతో ఈ వివాదానికి పరిష్కారం లభిస్తుందా లేదా అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.