మహబూబ్‌నగర్ జిల్లాలో ఘటన.. ఎనిమిది మందిపై కేసు నమోదు
మహబూబ్‌నగర్: అభిమానులమని నమ్మించి ప్రముఖ జబర్దస్త్ ఫేమ్ కొమురక్క (కుమార్)పై ఎనిమిది మంది దాడి చేసిన ఘటన మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండలం ఉడిత్యాలలో చోటుచేసుకుంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
ఎస్సై లెనిన్ తెలిపిన వివరాల ప్రకారం, రంగారెడ్డి జిల్లా బూర్గుల గ్రామ పరిధిలోని కాశిరెడ్డిగూడకు చెందిన శ్రీనాథ్ కొమురక్కకు అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. ఇటీవల ఉడిత్యాలలోని కొమురక్క నివాసంలో బంగారం చోరీకి గురైంది. ఈ విషయమై శ్రీనాథ్‌ను ప్రశ్నించగా, అతడు నేరాన్ని అంగీకరించి తిరిగి ఇస్తానని చెప్పినట్లు సమాచారం.
అయితే, పలుమార్లు అడిగినా బంగారం తిరిగి ఇవ్వకపోవడంతో రెండు రోజుల క్రితం కొమురక్క మరోసారి శ్రీనాథ్‌ను మందలించారు. ఈ విషయాన్ని మంగళవారం శ్రీనాథ్ తన స్నేహితులకు తెలియజేశాడు.
దీంతో వంశీకృష్ణ, వికాస్, చంద్రశేఖర్, గోవా శివ, రామచరణ్, నరేష్, పోతుల శివ, కిశోర్ అనే ఎనిమిది మంది అదే రోజు రాత్రి సుమారు 11 గంటల సమయంలో కొమురక్క ఇంటికి చేరుకున్నారు. తాము అభిమానులమని, ఫొటో దిగడానికి వచ్చామని నమ్మించారు.
ఇంతలో రామచరణ్ కొమురక్కతో వాగ్వాదానికి దిగుతూ శ్రీనాథ్‌ను ఎందుకు మందలించావని ప్రశ్నించాడు. ఈ క్రమంలో వంశీకృష్ణ రాయితో కొమురక్కపై దాడి చేయగా, అడ్డుకునేందుకు వచ్చిన అతని సోదరుడు యాదయ్యపై వికాస్ దాడి చేశాడు. చంద్రశేఖర్ కర్రతో కొమురక్క కుడి చేతిని గాయపరిచాడు.
దాడిని అడ్డుకునేందుకు వచ్చిన గ్రామస్థుడు రామును కూడా రాళ్లతో కొట్టారు. బాధితులను బెదిరిస్తూ అక్కడి నుంచి పరారయ్యే ప్రయత్నం చేశారు. స్థానికులు పట్టుకునేందుకు ప్రయత్నించగా, నిందితులు తమ ద్విచక్ర వాహనాన్ని అక్కడే వదిలేసి పారిపోయారు.
ఈ ఘటనపై బుధవారం బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఎనిమిది మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
