ఆత్మహత్యగా చిత్రీకరించిన ఘటనలో అసలు నిజం వెలుగులోకి
మాచర్ల: సమాజాన్ని కలచివేసే ఘోర ఘటన మాచర్ల పట్టణంలో వెలుగుచూసింది. ప్రేమ వివాహం చేసుకుందన్న కోపంతో కన్నతండ్రే తన కూతురిని హత్య చేసిన దారుణం చోటుచేసుకుంది. అనంతరం ఈ హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించిన విషయం పోలీసుల దర్యాప్తులో బయటపడింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మాచర్ల పట్టణంలోని 22వ వార్డు యాదవ బజార్‌కు చెందిన చంద్రశ్రీనుకు ఇద్దరు పిల్లలు. అతని కుమార్తె చౌడేశ్వరి ఇంటర్ వరకు చదివి ఇంట్లోనే ఉంటోంది. ఈ క్రమంలో సమీప ప్రాంతానికి చెందిన నాగరాజుతో ప్రేమలో పడింది. ఇద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారే అయినప్పటికీ, తమ ప్రేమను పెద్దలు అంగీకరించరని భావించి ఇంటి నుండి వెళ్లి వివాహం చేసుకున్నారు.
వివాహానంతరం కొద్ది రోజులు చెన్నైలో గడిపిన ఈ జంట, తర్వాత నర్సరావుపేటలో స్నేహితుడి ఇంటిలో నివసిస్తున్నారు. కూతురు ఇంటి నుండి వెళ్లిపోవడంతో చంద్రశ్రీను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారం రోజుల పాటు కూతురు ఆచూకీ లభించకపోవడంతో పోలీస్ స్టేషన్ ఎదుట ఆత్మహత్యాయత్నానికి కూడా ప్రయత్నించాడు.
దీంతో పోలీసులు ప్రత్యేక దృష్టి సారించి మూడు రోజుల తర్వాత చౌడేశ్వరి, నాగరాజును గుర్తించి మాచర్ల పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారు. ఇరువురు మేజర్లు కావడంతో తాము జోక్యం చేసుకోలేమని పోలీసులు స్పష్టం చేశారు. అనంతరం ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో పంచాయితీ నిర్వహించారు.
పంచాయితీలో చౌడేశ్వరి తన భర్త నాగరాజుతోనే ఉంటానని స్పష్టంగా చెప్పింది. అయితే పెద్దలు ఐదు రోజుల తర్వాత తుది నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఈ క్రమంలో చౌడేశ్వరిని తండ్రి తన ఇంటికి తీసుకెళ్లాడు.
అయితే మరుసటి రోజే చౌడేశ్వరి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులకు తెలియజేశారు. మొదట ఈ ఘటనను అందరూ ఆత్మహత్యగా భావించారు. కానీ పోలీసుల అనుమానం మేరకు కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిర్వహించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
పోస్టుమార్టం నివేదిక ప్రకారం, చౌడేశ్వరిని ముందుగా గొంతునులిపి హత్య చేసి, అనంతరం ఉరి వేసి ఆత్మహత్యగా చిత్రీకరించినట్లు తేలింది. దీంతో పోలీసులు చంద్రశ్రీనును అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు.
తనకు ఇష్టం లేని పెళ్లి చేసుకుందన్న ఒక్క కారణంతో కన్న కూతురినే హత్య చేసి, దాన్ని ఆత్మహత్యగా చూపించేందుకు ప్రయత్నించిన ఈ ఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంఘటన సమాజంలో మరొకసారి మహిళల భద్రత, స్వేచ్ఛపై చర్చకు దారితీసింది.
