యుద్ధం సెగ: మందు బాబులకు షాక్.. భారీగా పెరగనున్న మద్యం, బీరు ధరలు!

న్యూఢిల్లీ/హైదరాబాద్: అంతర్జాతీయ పరిణామాలు భారతీయ మద్యం ప్రియుల జేబులకు చిల్లు పెట్టనున్నాయి. మిడిల్ ఈస్ట్ దేశాల మధ్య కొనసాగుతున్న యుద్ధ వాతావరణం నేరుగా మీ ఇష్టమైన మద్యం బాటిల్ ధరపై ప్రభావం చూపనుంది. గ్యాస్ కొరత, సరఫరా వ్యవస్థలో ఆటంకాల కారణంగా త్వరలోనే బీరు, విస్కీ ధరలు పెరగనున్నట్లు పరిశ్రమ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

ధరల పెంపునకు ప్రధాన కారణాలు ఇవే

గాజు బాటిళ్ల తయారీ భారంగా: భారత్ తన గ్యాస్ అవసరాల కోసం ఖతార్ వంటి దేశాలపై ఎక్కువగా ఆధారపడుతుంది. యుద్ధం కారణంగా గ్యాస్ సరఫరా తగ్గి, ధరలు విపరీతంగా పెరిగాయి. గాజు బాటిళ్లను తయారు చేసే ఫర్నెస్‌లను మండించడానికి గ్యాస్ తప్పనిసరి. దీంతో బాటిళ్ల ఉత్పత్తి వ్యయం 15% నుంచి 20% వరకు పెరిగింది.

ప్యాకేజింగ్ ఖర్చులు: సాధారణంగా బీరు తయారీలో ప్యాకేజింగ్ ఖర్చు 40% వరకు ఉంటుంది. విస్కీ వంటి స్పిరిట్స్‌లో ఇది 20% ఉంటుంది. బాటిళ్ల ధర పెరగడం వల్ల కంపెనీలపై అదనపు భారం పడుతోంది.
అల్యూమినియం ధరల పెరుగుదల: కేవలం బాటిళ్లే కాదు, బీర్ క్యాన్లకు వాడే అల్యూమినియం ధరలు కూడా 15% పెరిగాయి. దీనికి తోడు షిప్పింగ్ ఛార్జీలు కూడా తోడవడంతో మద్యం బాటిళ్లపై 10% నుంచి 15% ధర పెంచక తప్పని పరిస్థితి నెలకొంది.

వేసవిలో బీరు కొరత ఏర్పడనుందా?

ప్రస్తుతం ఎండలు ముదురుతుండటంతో బీరుకు డిమాండ్ భారీగా పెరిగింది. ఒకవైపు గ్యాస్ కొరతతో బాటిళ్ల ఉత్పత్తి తగ్గడం, మరోవైపు డిమాండ్ పెరగడంతో మార్కెట్‌లో బీరు కొరత ఏర్పడే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

ప్రభుత్వాల నిర్ణయంపైనే ఆశలు

మద్యం తయారీ వ్యయం కంటే ప్యాకేజింగ్ వ్యయమే ఇప్పుడు కంపెనీలకు భారంగా మారింది. కంపెనీలు ఇప్పటికే ధరల పెంపు ప్రతిపాదనలను సిద్ధం చేశాయి. సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ధరల పెంపునకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే, త్వరలోనే కొత్త ధరలు అమలులోకి వస్తాయి.

WhatsApp Facebook
హోమ్ ఏపీ తెలంగాణ జాతీయ