తమిళనాడు రాజకీయాలు, సినీ రంగం ప్రస్తుతం హాట్ హాట్‌గా మారాయి. ఒకవైపు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుండగా, మరోవైపు టీవీకే అధినేత విజయ్ నటించిన తాజా చిత్రం జన నాయగన్ చుట్టూ పెద్ద వివాదం చెలరేగింది.
సెన్సార్ సమస్యలు, న్యాయపరమైన చిక్కుల్లో ఉన్న ఈ సినిమా ఇంకా విడుదల కాకముందే హెచ్‌డీ ప్రింట్ ఆన్‌లైన్‌లో లీక్ కావడం సినీ వర్గాల్లో సంచలనం రేపుతోంది. అంతేకాకుండా కోయంబత్తూరులోని ఒక లోకల్ టీవీ ఛానెల్ ఈ సినిమాను అక్రమంగా ప్రసారం చేయడం మరింత వివాదానికి దారితీసింది.ఈ ఘటనపై టీవీకే కోయంబత్తూరు ఈస్ట్ యూనిట్ డిప్యూటీ సెక్రటరీ మోహనప్రియ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టి, లోకల్ కేబుల్ ఆపరేటర్ పళనిస్వామిని అరెస్ట్ చేశారు. అనంతరం నిందితుడిని జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.
పోలీసుల సమాచారం ప్రకారం, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ అనుమతి లేకుండానే సినిమాను ప్రసారం చేయడం చట్టవిరుద్ధం. ఈ కేసులో ఉపయోగించిన కంప్యూటర్లు, హార్డ్‌డిస్క్‌లు సహా పలు ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. సంబంధిత ఛానెల్ కార్యాలయాన్ని కూడా సీజ్ చేశారు.
అక్రమ కాపీరైట్ కంటెంట్ ప్రసారంపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఇప్పటికే ఏప్రిల్ 9న కూడా జన నాయగన్కి సంబంధించిన కొన్ని క్లిప్స్ లీక్ కావడం గమనార్హం. ఇప్పుడు పూర్తి హెచ్‌డీ ప్రింట్ బయటకు రావడంతో చిత్రబృందం, అభిమానుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.