ఉరవకొండలో భారీ భూ కుంభకోణం: పోరంబోకు భూమి ప్రైవేటు చేతుల్లోకి?


ఉరవకొండ : అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం లత్తవరం గ్రామంలో వెలుగుచూసిన భూ అక్రమ రిజిస్ట్రేషన్ వ్యవహారం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. ప్రభుత్వ భూములను రక్షించాల్సిన అధికారుల నిర్లక్ష్యం లేదా ప్రమేయంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
గ్రామంలోని సర్వే నంబర్ 97/Bలో గల 1.06 ఎకరాల భూమి రెవెన్యూ రికార్డుల ప్రకారం ‘పోరంబోకు’ మరియు ‘రాస్తా’ (ప్రజల రాకపోకల దారి)గా నమోదై ఉంది. అయితే, ఈ భూమిని ప్రైవేటు వ్యక్తుల పేరిట నమోదు చేసినట్లు ఆరోపణలు రావడం ఆందోళన కలిగిస్తోంది.
లత్తవరం గ్రామానికి చెందిన బసివిని శకుంతలమ్మ పేరిట తప్పుడు వీలునామా సృష్టించి, ఆ ఆధారంగా పెద్ద ముస్తూరు గ్రామానికి చెందిన నెట్టెం రామకృష్ణప్పకు భూమి విక్రయించినట్లు రిజిస్ట్రేషన్ జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రక్రియలో భూమి స్వరూపం, సరిహద్దులు, ప్రభుత్వ రికార్డులు వంటి అంశాలను సమగ్రంగా పరిశీలించాల్సిన రెవెన్యూ మరియు రిజిస్ట్రేషన్ శాఖలు నిబంధనలు పాటించలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఈ అంశంపై ఉరవకొండకు చెందిన మీనుగ మధు బాబు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసి, ఈ భూ అక్రమంపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. ప్రభుత్వ రాస్తా భూమిని పట్టా చేయడం చట్టవిరుద్ధమని, దీనివల్ల భవిష్యత్తులో ప్రజలకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.
స్థానిక గ్రామస్తులు కూడా ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, తప్పుడు పత్రాలు సృష్టించిన వ్యక్తులతో పాటు వారికి సహకరించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ భూ వ్యవహారంపై జిల్లా యంత్రాంగం ఎలా స్పందిస్తుందో, ఆరోపణలపై విచారణ చేపట్టి నిజాలను వెలికితీస్తుందా అనే అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
WhatsApp Facebook
హోమ్ ఏపీ తెలంగాణ జాతీయ