భార్య కుట్రలో భర్త హత్య… ప్రియుడితో కలిసి దారుణం

ఇండోర్ : కుటుంబ బంధాలను కదిలించేలా మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. భార్య, తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించిన సంఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ సమీపంలోని గొండికోట చరణ్ గ్రామంలో చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, దేవకృష్ణ అనే వ్యక్తికి 12 ఏళ్ల క్రితం ప్రియాంకతో వివాహం జరిగింది. ప్రారంభంలో సవ్యంగా సాగిన వారి దాంపత్య జీవితం, కొన్నాళ్లకు విరసమైంది. ఈ క్రమంలో ప్రియాంక, కమలేష్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. భర్తతో కొనసాగలేనని భావించిన ఆమె, అతడిని అడ్డుగా భావించి తొలగించాలని నిర్ణయించుకుంది.

ఈ నేపథ్యంలో ప్రియాంక తన ప్రియుడు కమలేష్‌తో కలిసి కుట్ర పన్నింది. కమలేష్, సురేంద్ర అనే వ్యక్తికి సుమారు రూ.1 లక్ష ఇచ్చి దేవకృష్ణను హత్య చేయించేలా ప్లాన్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. మూడు రోజుల క్రితం రాత్రి ప్రియాంక ఇంటికి కమలేష్, సురేంద్ర వచ్చి దేవకృష్ణపై దాడి చేసి చంపేశారు.

హత్య అనంతరం కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నంలో ప్రియాంక పోలీసులకు ఫిర్యాదు చేసింది. రాత్రి దొంగలు ఇంట్లోకి చొరబడి తమను వేర్వేరు గదుల్లో నిర్బంధించి, నగలు, డబ్బు దోచుకెళ్లారని, అడ్డుకున్న తన భర్తను హత్య చేశారని తెలిపింది.

అయితే సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు ఇంట్లోనే నగలు, డబ్బు అలాగే ఉన్నట్లు గుర్తించారు. దీంతో ప్రియాంక చెప్పిన కథపై అనుమానం పెరిగింది. కఠినంగా విచారించడంతో ఆమె అసలు విషయం బయటపెట్టింది.

దీంతో పోలీసులు ప్రియాంకతో పాటు కమలేష్, సురేంద్రలను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. కుటుంబ సంబంధాలు, నమ్మకాలు ఎటువంటి పరిస్థితుల్లో ఎలా మారిపోతాయో ఈ సంఘటన మళ్లీ స్పష్టంచేసిందని పోలీసులు తెలిపారు.

WhatsApp Facebook
హోమ్ ఏపీ తెలంగాణ జాతీయ