పారదర్శకత, వేగం పెరుగుతాయని మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడి
అమరావతి, ఏప్రిల్ 8: రాష్ట్రంలో జోనల్ స్థాయి ఉద్యోగ నియామకాల ప్రక్రియలో పారదర్శకత పెంచేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై జోనల్ స్థాయి పోస్టుల భర్తీకి సంబంధించిన మొత్తం ప్రక్రియను ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు (APMSRB) ద్వారా నిర్వహించనున్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు.
నోటిఫికేషన్ జారీ నుంచి ఎంపిక జాబితా ఖరారు వరకు అన్ని దశలను రిక్రూట్మెంట్ బోర్డు పర్యవేక్షణలో నిర్వహిస్తామని మంత్రి తెలిపారు. ఈ నిర్ణయం ద్వారా నియామకాలు మరింత వేగంగా, పారదర్శకంగా పూర్తవుతాయని పేర్కొన్నారు. జీరో వెకెన్సీ విధానంలో పోస్టుల భర్తీ జరుగుతున్న నేపథ్యంలో ఈ మార్పు కీలకంగా మారనుందని చెప్పారు.
ప్రస్తుతం జోనల్ కార్యాలయాల ద్వారానే స్టాఫ్ నర్సులు, రేడియోగ్రాఫర్లు, ఫార్మసీ అసిస్టెంట్లు, మలేరియా ఆఫీసర్లు, స్టాటిస్టికల్ ఆఫీసర్లు, డిప్యూటీ స్టాటిస్టికల్ ఆఫీసర్లు, మెడికల్ రికార్డ్ టెక్నీషియన్ పోస్టుల భర్తీ జరుగుతోంది. విశాఖపట్నం, రాజమహేంద్రవరం, గుంటూరు, కడప కేంద్రాలుగా నాలుగు జోన్లలో నియామక ప్రక్రియ కొనసాగుతోంది.
దరఖాస్తుల స్వీకరణ నుంచి ఎంపిక జాబితా ఖరారు వరకు అన్ని ప్రక్రియలు జోనల్ కార్యాలయాల ద్వారానే నిర్వహించబడుతున్నాయి. అయితే భారీ సంఖ్యలో దరఖాస్తులు రావడం వల్ల పరిశీలనకు ఎక్కువ సమయం పడుతోందని అధికారులు చెబుతున్నారు. ఇటీవల రాజమహేంద్రవరం జోన్‌లో 310 నర్సుల పోస్టులకు సుమారు 12 వేల దరఖాస్తులు రావడంతో ఎంపిక ప్రక్రియకు మూడు నెలల వరకు సమయం పట్టింది.
జోనల్ కార్యాలయాల్లో సిబ్బంది కొరత కూడా సమస్యగా మారింది. రికార్డు అసిస్టెంట్ నుంచి సూపరింటెండెంట్ వరకు సగటున 15 మంది మాత్రమే ఉండటం, తాత్కాలికంగా డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఇతర సిబ్బందిపై ఆధారపడాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా నియామకాలు నిర్వహించడం ద్వారా అధికారులపై ఒత్తిడి తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
రిక్రూట్మెంట్ బోర్డులో దరఖాస్తుల పరిశీలన నుంచి ఎంపిక జాబితా ఖరారు వరకు స్పష్టమైన విధానం అమల్లో ఉంది. ఇప్పటికే మెడికల్ ఆఫీసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, సైకియాట్రిస్టులు తదితర పోస్టుల నియామకాలు ఈ బోర్డు ద్వారా జరుగుతున్నాయి.
డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, పబ్లిక్ హెల్త్, సెకండరీ హెల్త్, ఆయుష్ శాఖల ఇండెంట్ల ఆధారంగా బోర్డు నోటిఫికేషన్లు జారీ చేసి నియామకాలు చేపడుతోంది. ఆన్‌లైన్ ద్వారా కౌన్సెలింగ్ నిర్వహించబడుతుండగా, పోస్టింగ్ ఉత్తర్వులు సంబంధిత శాఖల ద్వారానే జారీ అవుతున్నాయి.
ఇటీవల పబ్లిక్ హెల్త్ పరిధిలో 482 వైద్యుల నియామకాలు ఇదే విధానంలో పూర్తయ్యాయి. ఇదే విధానాన్ని జోనల్ స్థాయి పోస్టుల భర్తీలోనూ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2024 జూన్ నుంచి 2026 మార్చి 31 వరకు మొత్తం 2,310 నియామకాలు ఈ బోర్డు ద్వారా జరిగాయి. త్వరలో బోధనాసుపత్రుల్లో 317 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు.
