చరిస్మ హౌసింగ్ బాధితుల ఆవేదన
ఎస్సీ కమిషన్ చైర్మన్‌ను ఆశ్రయించిన పెట్టుబడిదారులు
తిరుపతి: చరిస్మ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ (సి.ఆర్.ఎస్ ఎస్టేట్స్) డైరెక్టర్ల చేతిలో మోసపోయామని ఆరోపిస్తూ బాధితులు మంగళవారం ఎస్సీ కమిషన్ చైర్మన్ కె.ఎస్. జవహర్ను కలిసి తమ ఆవేదన వ్యక్తం చేశారు.
బాధితుల కథనం ప్రకారం, సంస్థ డైరెక్టర్లు సి.ఎన్. మల్లికార్జునరెడ్డి, పి. శ్రీదేవి రియల్ ఎస్టేట్ వెంచర్ల పేరుతో ప్రజల నుండి భారీగా పెట్టుబడులు సేకరించారు. అయితే, వాగ్దానం చేసిన విధంగా ప్లాట్లు ఇవ్వకుండా, డబ్బులు కూడా తిరిగి చెల్లించకుండా తమను మోసం చేశారని వారు ఆరోపించారు.
ఈ నేపథ్యంలో బాధితులు తమకు జరిగిన అన్యాయాన్ని వివరించి, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని చైర్మన్‌ను కోరారు. అలాగే తమ పెట్టుబడులను తిరిగి ఇప్పించి న్యాయం చేయాలని వినతిపత్రం సమర్పించారు.
బాధితుల ఫిర్యాదుపై స్పందించిన చైర్మన్ కె.ఎస్. జవహర్, ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
