పాల్తూరు సెక్టార్‌లో పోషణ పక్వడ కార్యక్రమం: తల్లులకు ఆరోగ్య అవగాహన

ఉరవకొండ: అనంతపురం జిల్లా ఉరవకొండ ప్రాజెక్టు పరిధిలోని పాల్తూరు సెక్టార్ హవలిగి 7వ ఆంగన్‌వాడీ కేంద్రంలో పోషణ పక్వడ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం సీడీపీవో ఆదేశాల మేరకు, ఐసీడీఎస్ సూపర్వైజర్ పుష్ప ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా రెండేళ్ల లోపు పిల్లల తల్లులకు పోషకాహారంపై విస్తృతంగా అవగాహన కల్పించారు. పిల్లలకు బయట ఆహారం ఇవ్వకుండా ఇంట్లో తయారు చేసిన తాజా ఆహారాన్ని అందించాలని సూచించారు. ముఖ్యంగా పండ్లు, కూరగాయలు, పప్పుదినుసులతో తయారుచేసిన ఆరోగ్యకరమైన ఆహారాన్ని పిల్లలకు అందించడం ఎంతో అవసరమని వివరించారు. జంక్ ఫుడ్ వలన పిల్లల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందని, అలాంటి ఆహారాలను పూర్తిగా నివారించాలని తల్లులకు సూచించారు. అలాగే చిన్నారులకు మొబైల్ ఫోన్ వినియోగం వల్ల కలిగే అనర్థాలపై వీడియోల ద్వారా అవగాహన కల్పించారు. పిల్లల ఆరోగ్యం, పోషణలో తల్లుల పాత్ర కీలకమని, సరైన ఆహార అలవాట్లు చిన్ననాటి నుంచే అలవాటు చేయాలని అధికారులు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పాల్గొన్న తల్లులందరితో పోషణపై ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఆంగన్‌వాడీ వర్కర్లు నాగవేణి, అంబిక, సుమిత, శశికళతో పాటు పిల్లల తల్లులు పాల్గొన్నారు. ఇలాంటి కార్యక్రమాలు గ్రామీణ ప్రాంతాల్లో పిల్లల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కీలకంగా మారుతున్నాయని నిర్వాహకులు తెలిపారు.

WhatsApp Facebook
హోమ్ ఏపీ తెలంగాణ జాతీయ